Crime: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ అన్నయ్య రామ్ కుమార్ బిందాల్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. డాక్టర్ అయిన రామ్ కుమార్ తనకు చికిత్స చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు మహిళ ఆరోపించింది. అత్యాచార బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. చికిత్స చేసినప్పటికీ తనకు ఎటువంటి ఉపశమనం లభించలేదని ఆమె అన్నారు.
అక్టోబర్ 07న, ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటాననే నెపంతో అతను తన చేతులను తాకుతూ, లైంగిక సమస్యల గురించి అడిగినట్లు మహిళ ఆరోపించింది. మహిళ తన అనారోగ్య సమస్యల్ని వివరించిన తర్వాత, రామ్ కుమార్ తాను 100 శాతం నయం చేస్తానని హమీ ఇచ్చాడు. అయితే, పరీక్షల సమయంలో తన ప్రైవేట్ భాగాలను చెక్ చేయాలనే నెపంతో పరీక్షలు చేస్తున్నట్లు నటిస్తూ, తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందిన మహిళ, రామ్ కుమార్‌ని తోసేసి అక్కడి నుంచి పారిపోయిందని, ఆ తర్వాత పోలీసులను సంప్రదించి నిందితుడిపై కేసు నమోదు చేసిందని ఎస్పీ సింగ్ తెలిపారు. నేరం జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ బృంద దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.