Live-In Partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్న వారు తమ భాగస్వాములను కిరాకతంగా హత్య చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గురుగ్రామ్ సమీపంలోని చౌమా గ్రామంలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో మహిళ శవమై కనిపించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో లలన్ యాదవ్(35) అనే నిందితుడు మద్యం మత్తులో మహిళను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
కోడిగుడ్డు కూర చేయడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన లలన్ మహిళను సుత్తి, బెల్టుతో కొట్టాడని పోలీసులు తెలిపారు. బీహార్ మాధేపూరా జిల్లాలోని ఔరాహి గ్రామానికి చెందిన లలన్ యాదవ్‌ని ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతం నుండి పాలం విహార్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also: S Jaishankar: ఉక్రెయిన్‌పై అణు దాడిని నివారించడానికి ప్రధాని మోడీ సహాయం చేశారా?
చౌమా గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో అంజలి(32) శవమై కనిపించింది. శవాన్ని గమనించిన భవనం కేర్ టేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురుగ్రామ్ బస్టాండ్ నుంచి లలన్ యాదవ్, అంజలిని పని ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఇంటి యజమాని వారి చిరునామాలు, ఐడీలు తీసుకోలేదు. లలన్, అంజలిని తన భార్యగా పరిచయం చేశాడు. ఎగ్ కర్రీ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడం హత్యకు దారి తీసింది.
ఆరేళ్ల క్రితం పాముకాటుతో తన భార్య చనిపోయిందని, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చానని విచారణలో నిందితుడు తెలిపాడు. ఏడు నెలల క్రితం అంజలిని కలిశానని, ఇద్దరూ కూలి చేసుకుంటూ కలిసి జీవించడం ప్రారంభించామని వెల్లడించాడు. అంజలి హత్య తర్వాత అతను పారిపోయాడు, చివరకు పోలీసులకు చిక్కాడు. హత్యకు ఉపయోగించిన సుత్తి, బెల్టుని స్వాధీనం చేసుకున్నాడు.