ఒకప్పుడు భర్తల వేధింపులు భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. తర్వాత కట్నం వేదింపులకు మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య వేదింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంత మంది భర్తలు. సరిగ్గా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు బ్రహ్మయ్య, కౌసల్య. వీరిద్దరూ భార్యాభర్తలు. కాపురానికి వచ్చిన మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది. తర్వాత అత్తతో కౌసల్యకు విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా ముదిరింది. దీంతో తాను ఇంట్లో ఉండనని తేల్చిచెప్పింది కౌసల్య. ఇక చేసేదేమీలేక భర్త బ్రహ్మయ్య తన భార్య కౌసల్యతో కలిసి తాడేపల్లిలో వేరుకాపురం పెట్టాడు..
READ MORE: Crime News: ప్రియుడు కాదు.. ఆమె పాలిట యముడు..!
సీసీ కెమెరా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బ్రహ్మయ్య.. తన భార్య తరచూ ఫోన్లో మాట్లాడడం గమనించాడు. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావంటూ భార్యను అడిగాడు. కానీ కౌసల్య నుంచి సరైన సమాధానం రాలేదు. చివరకు తన భార్యకు పెళ్లికి ముందే మరొకరితో ప్రేమవ్యవహారం నడిపిన విషయం తెలుసుకున్నాడు. వెంటనే అత్తామామలను పిలిపి ఇదే విషయాన్ని చెప్పాడు. కొంతకాలం దూరంగా ఉంటే అంతా సర్దుకుంటాయని భావించిన కౌసల్య తల్లితండ్రులు.. తమ కూతురిని తీసుకెళ్లారు. నాలుగు నెలల తర్వాత అల్లుడితో మాట్లాడి మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని, ఇద్దరూ కలిసి ఉండండని చెప్పారు. దీంతో అల్లుడు బ్రహ్మయ్య సరే అన్నాడు. కొన్నిరోజులు బాగానే ఉన్న కౌసల్య మళ్లీ తన పాత పద్దతిలోనే ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. దీంతో తన భార్య మారదని భావించాడు. ఇదే సమయంలో ఆషాడమాసం రావడంతో కౌసల్య పుట్టింటికి వెళ్లింది. అక్కడైనా పద్దతిగా ఉంటుందని భావించాడు. అయితే పుట్టింటికి వెళ్లిన భార్యతో మాట్లాడదామని బ్రహ్మయ్య ఫోన్ చేస్తే ఎప్పుడూ ఎంగేజ్ వస్తుంది.
రాత్రి సమయంలో అయినా మాట్లాడాలని ప్రయత్నించినా భార్య ఫోన్ ఎంగేజ్ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీనికితోడు కౌసల్య భర్తతో ఫోన్లో బెదిరింపులకు దిగినట్లు మాట్లాడేది. తన భార్య మారకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇంట్లో సెల్ ఫోన్లో రికార్డు చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన చావుకు కారణం తన భార్యే అంటూ చెప్పాడు. మరుసటిరోజు ఇంటినుంచి బ్రహ్మయ్య బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంటి కిటికీలోనుంచి చూస్తే ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయిన బ్రహ్మయ్య కనిపించాడు. వెంటనే కుటుంబ సబ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. నులకపేటలో ఉన్న బ్రహ్మయ్య తల్లి విజయప్రమీల కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యింది. తన కొడుకు మృతికి కారణమైన కోడలు కౌసల్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. బ్రహ్మయ్య తల్లి విజయ ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సెల్పీ వీడియోతోపాటు బ్రహ్మయ్య తల్లి చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు..