ఈనెల 4వ తేదీన ఘనంగా పెళ్ళి జరిగింది.. ఆ తర్వాత 5వ తారీఖున రిసెప్షన్ జోరుగా నిర్వహించారు.. ఈ రెండు రోజులూ వరుడు చాలా సంతోషంగా కనిపించాడు. కానీ.. ఆ తర్వాతి రోజు మాత్రం తన ఇంట్లోనే విగత జీవిగా మారాడు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. అనంతరం 5వ తేదీన వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ గ్రాండ్‌గా చేశారు. ఈ వేడుకలో నరేష్ ఆనందంగానే కనిపించడంతో పాటు స్నేహితులతో కలిసి డ్యాన్స్ వేశాడు కూడా!
రిసెప్షన్ అనంతరం విజయవాడ సమీపంలోని గుణదల దైవదర్శనానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నరేష్ చేసుకున్నాడు. రెండు కార్లు కూడా మాట్లాడాడు. తెల్లవారుజామున 3 గంటలకే అందరినీ లేపి, ప్రయాణానికి సిద్ధం చేశాడు. అందరూ రెడీ అయ్యాక, తాను స్నానం చేసి వస్తానంటూ గదిలోకి వెళ్లాడు. అంతే, అలా వెళ్లినోడు తిరిగి బయటకు రాలేదు. డోర్ కొడుతున్నా, బయట నుంచి కేకలు పెడుతున్నా.. నరేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. బాత్రూం డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ నిర్ఘాంతపోయారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి వున్న నరేష్‌ను చూసి హతాశులయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోనుకొని.. అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
నరేష్ ఆరేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఇతను, గ్రూప్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. పెళ్లీడుకి రావడంతో కుటుంబీకులు అతని పెళ్లి ఘోరంగా నిర్వహించారు. పెళ్ళి రోజు, ఆ తర్వాత రిసెప్షన్‌లోనూ ఆనందంగానే కనిపించాడు. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడడంతో అంతుచిక్కడం లేదు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.