Drug Abuse: తిరుపతి జిల్లాలో మత్తు మందు మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోవడంతో.. పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి.. డ్రగ్స్ తీసుకునే వారిని కనిపెడుతున్నారు. తాజాగా, ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగిపెట్టడ, వాణి నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఒక కీలక సమాచారం వెలికి తీశారు.
Read Also: Donald Trump: అర్ధరాత్రి ‘సుంకాల’ బాంబు పేల్చనున్న ట్రంప్.. భారత్‌పైనేనా?
అయితే, వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించిన.. ఆ తర్వాత వారి తల్లిదండ్రులను కూడా అక్కడికి పిలిపించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువత మత్తు మాయలో పడకుండా జాగ్రత్త పడాలని, పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా చర్యలు ముమ్మరం చేయాలని పోలీసుల్ని కోరుతున్నారు. డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.