Wife and Husband: ఢిల్లీలో ఓ మహిళ, తన భర్తపై దారుణమైన దాడికి పాల్పడింది. దినేష్ అనే వ్యక్తి తన మదన్‌గీర్ ఇంట్లో నిద్రిస్తుండగా, అతడి భార్య మరిగే నూనె, కారం పొడితో దాడి చేసింది. అక్టోబర్ 3న ఈ దాడి జరిగింది. 28 ఏళ్ల దినేష్ తీవ్రంగా కాలిన గాయాలపాలైన తర్వాత, సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిపై స్థానిక అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దినేష్ నిద్రపోతున్న సమయంలో, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతడి భార్య, అతడి శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో వారి 8 ఏళ్ల కుమార్తె కూడా అదే ఇంట్లో ఉంది.
దినేష్ తనపై జరిగిన దాడిని పోలీసులకు చెప్పాడు. ‘‘అక్టోబర్ 2న పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాను. నా భార్య, కుమార్తె కూడా సమీపంలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో నా శరీరం అంతా తీవ్రమైన మంట, నొప్పి అనిపించి నిద్రలేశాను. ఆ సమయంలో నా భార్య నా ముఖం, ఇతర శరీరంపై వేడి నూనె పోసింది. లేవడానికి ప్రయత్నించే సమయంలో నాపై ఎర్ర కారం పొడి చల్లింది’’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read Also: Rohit Sharma: పగలబడి నవ్వకున్న రోహిత్ శర్మ.. వీడీయో చూస్తే మీక్కూడా నవ్వాగదు!
తాను అరుస్తున్న సమయంలో, మరింత అరిస్తే తాను మిగతా నూనె పోస్తానని తన భార్య బెదిరించినట్లు చెప్పాడు. ఈ కేకలు విన్న పొరుగింటి వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు తలుపు తెరవాలని గట్టిగా కోరడంతో అతడి భార్య తలుపు తెరిచిందని, నొప్పిలో విలవిలలాడున్న దినేష్‌ను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ముందుగా దినేష్ భార్యనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పిందని, అనుమానం వచ్చి, తామే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పొరుగింటి వారు వెల్లడించారు.
వైద్య నివేదికలో ప్రమాదకరమైన గాయాలపాలైనట్లు వెల్లడైంది. ఈ జంటకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇతడి భార్య రెండేళ్ల క్రితం, వేధింపుల ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విషయం రాజీ ద్వారా పరిష్కారమైంది. ప్రస్తుతం, దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయలేదని ఒక అధికారి తెలిపారు.