నేటి కాలంలో ఆచార్య దేవో భవకు అర్థమే మారిపోతుంది. సినిమాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ.. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణతో టెన్త్ స్టూడెండ్‌ను 8వ తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనను ఇంకా మరువక ముందే ఉత్తరాఖండ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. క్లాస్‌రూమ్‌లో అందరి ముందు ఉపాధ్యాయుడు మందలించాడని.. కోపంతో 8వ తరగతి విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో తుపాకీ పేలుడు శబ్దం భయాందోళనకు గురిచేసింది. బుధవారం 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు గగన్ సింగ్‌ను తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ నేరుగా భుజంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా పాఠశాల భవనం గందరగోళానికి గురైంది. వెంటనే సిబ్బంది టీచర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. తుపాకీని లంచ్ బాక్స్‌లో దాచుకుని తెచ్చినట్లుగా గుర్తించారు. బుల్లెట్ ఉపాధ్యాయుడి భుజానికి తాకిందని.. శస్త్ర చికిత్స తర్వాత తొలగింపడిందన్నారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
ఇక విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రమశిక్షణలో భాగంగా కొద్దిరోజుల క్రితం ఉపాధ్యాయుడు.. విద్యార్థిని తిట్టి, చెంపదెబ్బ కొట్టినట్లుగా తేలింది. దీంతో అప్పటినుంచి విద్యార్థి పగతో రగిలిపోతున్నట్లుగా కనిపెట్టారు. కోపం చల్లారకపోవడంతో తుపాకీ తీసుకొచ్చి కాల్పులు జరిపినట్లుగా పోలీసులు కనుగొన్నారు. కాశీపూర్ ఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్.. ఇతర విద్యార్థులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విద్యార్థిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక విద్యార్థికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి కూడా వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థిని త్వరలో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఉధమ్ సింగ్ నగర్ ఎస్ఎస్పీ మణికాంత్ మిశ్రా అన్నారు.