Charlapally Dead Body: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి..డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ వ్యక్తి.. తాపీగా వచ్చి మహిళ డెడ్ బాడీని చాలా క్యాజువల్‌గా ఓ బ్యాగ్ పెట్టినట్లు వదిలేసి వెళ్లాడు…
READ ALSO: Medchal Wife Murder: కిరాతక మొగుడు కాలయముడయ్యాడు..
ఆ మహిళ ఎవరు?
చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని.. తెల్లటి ప్లాస్టిక్ సంచిలో నుంచి రక్తం కారడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంచిని ఓపెన్ చేసి చూడడంతో మహిళ శవం కనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకుని ఆ మహిళ ఎవరు? ఎవరు హత్య చేసి ఉంటారు? అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఈ క్రమంలో నిందితున్ని గుర్తించారు. ఓ ఆటోలో యువకుడు తెల్ల సంచి పట్టుకుని వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అతను గోడ పక్కనే డెడ్ బాడీ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను నేరుగా రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న లాంజ్ రూమ్‌కు చేరుకున్నాడు. స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత నేరుగా అస్సాం వెళ్తున్న ట్రెయిన్ ఎక్కేశాడు..
చంపింది ఎవరు?
అసలు అతడు ఎవరు అనేది ఇంత వరకు పోలీసులు గుర్తించినప్పటికీ.. అతడు ట్రెయిన్ ఎక్కడ దిగాడు? ఏ ప్రాంతానికి వెళ్లాడు? అసలు అతడు ఎవరు? అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయంటున్నారు. మరోవైపు మృతి చెందిన మహిళ పేరు ప్రమీలగా గుర్తించారు. ఆమె మణికొండలో.. నిందితుడితో సహజీవనం చేస్తోందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీల.. గత 10 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిందంటున్నారు. నిందితుడు ఆమెను మణికొండలోనే చంపేసి.. దాదాపు 36 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చి పడేశాడు. ప్రస్తుతం మహిళ డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక ఆధారాల ద్వారా కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు..