Anesthetic Injections : హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకున్న మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది. మత్తు కోసం అనస్తీషియా ఇంజెక్షన్లు తీసుకున్న ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి చెందిన ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కేసులో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేయగా, వైద్య వృత్తికే మచ్చ తెచ్చే విధంగా కీలక విషయాలు కలకలం రేపుతున్నాయి. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు కొంతకాలంగా మత్తు కోసం ఇంజెక్షన్లకు అలవాటు పడ్డారు. సాధారణ మత్తు పదార్థాలకన్నా ఎక్కువ ప్రభావం కోసం వారు అనస్తీషియా ఇంజెక్షన్లను తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
అధిక డోస్ కారణంగా వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి చివరకు ఇద్దరూ ఆటోలోనే మృతి చెందారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా, ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై కీలక ఆధారాలు లభించాయి. రోగులకు చికిత్స కోసం ఉపయోగించాల్సిన మత్తు ఇంజెక్షన్లను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ జైపాల్‌రెడ్డి బహిరంగ మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయన వద్ద నుంచి ఈ ప్రమాదకరమైన ఇంజెక్షన్లు బయటకు వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు.
డాక్టర్ జైపాల్‌రెడ్డితో పాటు మరో ఆస్పత్రికి చెందిన వైద్యుడి పాత్ర కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందని దర్యాప్తులో తేలింది. ఇద్దరూ కలిసి అనస్తీషియా ఇంజెక్షన్లను అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆస్పత్రుల్లో స్టాక్‌లో ఉన్న ఔషధాలను బయటకు మళ్లించి, మత్తు కోసం అలవాటు పడిన వారికి అమ్మినట్లు పోలీసులు పేర్కొన్నారు. వైద్య పర్యవేక్షణ లేకుండా అనస్తీషియా ఇంజెక్షన్లు వినియోగిస్తే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శస్త్రచికిత్సల సమయంలో మాత్రమే, అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాల్సిన ఇంజెక్షన్లు ఇలా బహిరంగంగా విక్రయించడమే ఈ దుర్ఘటనకు కారణమైందని పోలీసులు భావిస్తున్నారు.
New Regional Alliance: భారత్‌పై కుట్రకు ప్లాన్ చేస్తున్న పాక్.. డ్రాగన్‌తో కొత్త కూటమికి సన్నాహాలు