భారతీయులకు క్రికెట్ కేవలం ఆట కాదు… అదో పండగ! అదే ఎమోషనల్ బాండింగ్! అలాంటి క్రికెట్ చరిత్రలో 25 జూన్ 1983కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తొలిసారి భారతీయ క్రికెట్ టీమ్ చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో వరల్డ్ కప్ ను చేజిక్కించుకున్న రోజది! ఆనాటి టోర్నమెంట్ గురించి ఈ తరానికి పెద్దంతగా తెలియదు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని ఆ కీలక ఘట్టాన్ని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ’83’ పేరుతో తెరకెక్కించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 24న పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మనం ఇంతవరకూ క్రీడల నేపథ్యంలోనూ, క్రీడాకారుల జీవిత సంఘటనల నేపథ్యంలోనూ కొన్ని సినిమాలను తెరకెక్కిన చిత్రాలు చూశాం. కానీ నిజ జీవితంలో జరిగిన ఓ ఆటకు సంబంధించిన పూర్తి స్థాయి సినిమాను చూడలేదు. దాదాపు 38 సంవత్సరాల క్రితం జరిగిన ఓ టోర్నమెంట్ ను ఇప్పటి జనాలకు చూపడం అనేది ఓ పెద్ద టాస్క్, అంతే కాదు రిస్క్ కూడా! ఇవాళ క్రికెట్ ను భారత యువత ఇంతలా శ్వాసించడానికి కారణం 1983 జూన్ 25న ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో మన వాళ్ళు చూపిన పోరాట పటిమ. ఆ ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు కబీర్ ఖాన్. నిజానికి ఈ సినిమాలో కథ అంటూ ఏమీ లేదు. క్రికెట్ ఆట పట్ల దానిని నిర్వహించే వారికి కూడా ఎలాంటి గౌరవం, అభిమానం లేని ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి, వరుసగా రెండు సార్లు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన వెస్ట్ ఇండీస్ టీమ్ ను ఎదురించి, మనవాళ్ళు ఎలా కప్పు గెలిచారన్నదే కథ. దాదాపు రెండు గంటల నలభై నిమిషాల పాటు సాగే ఈ సినిమాలో ఏ ఒక్క క్షణం మనకు బోర్ కొట్దదు, తరచూ టీవీల్లో గంటల కొద్ది చూస్తున్న క్రికెట్ ఆటే కదా! అని అనిపించదు. ఆ రోజున మనవాళ్ళు ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో విశ్వ విజేతలుగా నిలిచారు అనేది తెర మీద చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అనుక్షణం అవహేళనలు, అవమానాల నడుమ విశ్వాసం ఏ మాత్రం కోల్పోకుండా విజయమే లక్ష్యంగా మన క్రికెట్ టీమ్ చూపిన తెగువను చూస్తే గూజ్ బంబ్స్ వస్తాయి. అప్పట్లో సాంకేతిక కారణంగా ఇండియా – జింబాబ్వే మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ ను భారతీయులు చూడలేకపోయారు. ఆ ఆటలోనే ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ 175 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఆ సమయంలో అతను చేసిన ఒక్క పరుగుకు స్టేడియం అంతా స్టాండింగ్ వొవేషన్ ఇస్తుంటే ఎందుకలా చేస్తున్నారో అర్థం కాక అయోమయంలో ఉన్న కపిల్ దేవ్ ను చూస్తే ముచ్చటేస్తుంది. వ్యక్తిగత రికార్డుల కోసం పాకులాడకుండా మనవాళ్ళు దేశం కోసం ఆ రోజుల్లో ఎలా ఆడారో కదా! అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే కబీర్ ఖాన్ మనసులో ఏ ముహూర్తాన కపిల్ దేవ్ స్థానంలో రణవీర్ సింగ్ మెదిలాడో కానీ ఆ పాత్రలోకి అతను నిజంగానే పరకాయ ప్రవేశం చేశాడు. కేవలం వేషధారణే కాదు, కపిల్ దేవ్ బాడీ లాంగ్వేజ్ ను, మేనరిజమ్స్ ను కూడా పర్ ఫెక్ట్ గా దించేశాడు. ఇక రణవీర్ నిజ జీవిత భాగస్వామి, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, కపిల్ భార్య రొమిగా నటించడం మరో విశేషం. సినిమా ద్వితీయార్థంలోనే ఆమె ఎంట్రీ ఇచ్చినా, తనదైన మార్కును చూపించింది. టీమ్ మేనేజర్ మాన్ సింగ్ గా పంకజ్ త్రిపాఠీ అద్భుతంగా నటించాడు. సునీల్ గవాస్కర్ గా తాహిర్, రోజర్ బిన్ని గా నిషాంత్, శ్రీకాంత్ కృష్ణమాచారిగా జీవా (ఇతనికి నటుడు రాహుల్ రవీంద్రన్ డబ్బింగ్ చెప్పాడు), మదన్ లాల్ గా హార్డీ సందు, మహీందర్ అమర్ నాథ్ గా సకీబ్ సలీమ్, బల్వీందర్ సంధుగా అమ్మి విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీగా సాహిల్ కత్తార్, మోస్ట్ హ్యాండ్సమ్ క్రికెటర్ సందీప్ పాటిల్ గా చిరాగ్ పాటిల్, వరల్డ్ కప్ లో తీవ్రంగా గాయపడిన వెంగ్ సర్కార్ పాత్రలో అధినాద్ కొఠారే, టాల్ అండ్ హాడ్సమ్ క్రికెటర్ రవిశాస్త్రి గా ధైర్యా కార్వా, కీర్తి ఆజాద్ గా దినకర్ శర్మ నటించారు. ఇక బ్రిటన్ లో ఇండియన్ కామెంటేటర్ గా బొమ్మన్ ఇరానీ, మదన్ లాల్ భార్యగా తెలుగు చిత్రాలలో నటించిన వామికా గబ్బి కనిపించారు. విశేషం ఏమంటే… లార్డ్స్ మైదానంలో ఆడియెన్స్ స్థానంలో కపిల్ దేవ్ మెరుపులా మెరిస్తే, ఆ రోజున టీమ్ లో ఉన్న మహీందర్ అమరనాథ్… తన తండ్రి లాలా అమర్ నాథ్ పాత్రను పోషించారు. కపిల్ తల్లి గా నీనా గుప్తా నటించింది. ఇక వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతుండగా, బాలుడిగా ఉన్న సచిన్ దానిని వీక్షించి, స్ఫూర్తి పొందినట్టు చూపడం ఓ కొసమెరుపు. ఇదిలా ఉంటే… దేశంలోని మత విభేదాలను ఓ క్రీడ ఎలా తుడిచేసి, అందరినీ ఒక దగ్గరకు చేర్చుతుందో కూడా ఈ సినిమాలో చూపించారు. నటీనటులు అంతా తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చారు. అసీమ్ మిశ్రా సినిమాటోగ్రఫీ, ప్రీతమ్ సంగీతం మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. కబీర్ ఖాన్, వాసన్ బాలా, సుమిత్ అరోరా రాసిన సంభాషణలూ ఎంతో చక్కగా ఉన్నాయి.
దీపికా పదుకొనే, విష్ణువర్థన్, సాజిద్ నడియాద్ వాలా, రిలయెన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలోని గొప్పతనం ఏమంటే… దీన్ని చూస్తున్నంత సేపు మనం కూడా క్రీడా మైదానంలోనూ, ఆటగాళ్ళ డ్రస్సింగ్ రూమ్ లోనూ ఉన్నట్టే ఉంటుంది. మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్ళడంతో పాటు, ఆ విజయోత్సవంలోనూ భాగస్వాముల్ని చేసేలా కబీర్ ఖాన్ దీన్ని చిత్రీకరించాడు. ఓ రకంగా ఈ యేడాదికి ఉత్తేజ భరితమైన ఓ చక్కని క్రీడా చిత్రంతో సెండాఫ్ చెబుతున్నట్టు భావించొచ్చు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల పనితనం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
ఎమోషన్స్ ను సరిగా క్యాప్చర్ చేయకపోవడం
రేటింగ్: 3.5/5
ట్యాగ్ లైన్: విన్నింగ్ టీమ్!