Janasena Formation Day LIVE: జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ బహిరంగసభ వేదికగా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం ఇదే కావడంతో.. ప్రాధాన్యత ఏర్పడింది.. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, విజయాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు.. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కల్యాణ్…
జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ వైసీపీపై సెటైర్లు వేశారు. ఎన్నికలకు ముందు మాజీ సీఎం జగన్ నిద్రలోకి వెళ్లిపోయారని.. ఇంకా ఆ నిద్ర నుంచి బయటకు రాలేదని చెప్పారు. అప్పుడప్పుడు ఆయన మాటలు చూస్తే నిద్రలో కలవరిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జగన్ ఇంకో 20 ఏళ్లు నువ్వు పడుకో.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటూ సెటైర్లు వేశారు.
మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, జనసేన నేతలకు స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభకు ఆయన మరికొద్ది సేపట్లో వెళ్తారు. హెలికాప్టర్ ద్వారా ఆయన పిఠాపురం వెళ్లారు. సభకు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకున్నారు.
పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా రాజావారి ద్వారం నుంచి వచ్చిన వీరమహిళలను ముందుగా స్టేజి మీదకు ఆహ్వానించారు. వారితో జ్యోతి ప్రజ్వలన చేయించి సభను ప్రారంభించారు. అనంతరం వారంతా జై జనసేన నినాదాలు చేశారు. అనంతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. జనసేన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా అభినందించారు. పవన్ తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు.
పిఠాపురం జనసేన సభ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని రాజావారి ద్వారం నుంచి వెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ ఎమ్మెల్యే, అతని అనుచరులు లోపలకు వెళ్లారు.
పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ 90 నిముషాల పాటు మాట్లాడుతారు. ఇందులో 12 ఏళ్లుగా జనసేన చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లడానికి మూడు ద్వారాలు.. పిఠాపురం రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలు పాస్‌లకు ఎంట్రీ.. డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వీఐపీ, వీవీఐపీ పాస్‌లకు.. మల్లాడి సత్యలింగం నాయకర్ ద్వారం నుంచి జనసేన కార్యకర్తలకు ఎంట్రీ కాావాల్సి ఉంటుంది.