సమాజంలోని సంచలన సంఘటనలను సినిమాలుగా తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ఆ తరహా చిత్రాల ద్వారా సమాజానికి వర్మ ఏం సందేశం ఇస్తున్నారు అనే దానికంటే… తన పాపులారిటీని పెంచుకోవడానికి ఆ సంఘటనలను వాడుకుంటున్నారు అనేది వాస్తవం. శంషాబాద్ సమీపాన 2019లో జరిగిన దిశ హత్య, ఆపైన జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో వర్మ ‘ఆశ: ఎన్ కౌంటర్’ పేరుతో ఓ సినిమా తీశారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా కొత్త సంవత్సరం తొలి రోజున జనం ముందుకు వస్తోంది.
నవంబర్ 27, 2019వ తేదీ వెటర్నరీ గ్రాడ్యుయేట్ దిశ అత్యంత పాశవికంగా నలుగురు కిరాతకుల చేతిలో మానభంగానికి గురైంది. మత్తులో మునిగిపోయిన ఆ కుర్రాళ్ళు తర్వాత ఆమెను సజీవ దహనం చేశారు. విషయం వెలుగులోకి రాగానే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ నర హంతకులను అరెస్ట్ చేశారు. విచారణ క్రమంలో క్రైమ్ రీ-కన్ స్ట్రక్షన్ చేస్తుండగా ఎస్కేప్ కావాలని చూసిన ఆ నలుగురినీ పోలీసులు డిసెంబర్ 6వ తేదీ ఎన్ కౌంటర్ చేశారు. దిశ మానభంగాన్ని ఎంతమంది ఖండించారో, అంతమంది కాకపోయినా బుద్ధి జీవులు కొందరు పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని ఎన్ కౌంటర్ చేయడాన్ని ఖండించారు. అయితే వారి వాదనను చెవికెక్కించుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో వర్మ ఒకరు. దిశ ఉదంతంలో అసలు దోషి సమాజమని, దారి తప్పిన కుర్రాళ్ళ ప్రవర్తనలో సమాజం పాత్ర కూడా ఖచ్చితంగా ఉందని వర్మ వాదన. అందుకే ‘ఆశ ఎన్ కౌంటర్’ చిత్రాన్ని దిశ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా మానవహక్కుల పరిరక్షకుల యాంగిల్ లోనూ జనం ముందు పెట్టే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు.
సామాజిక బాధ్యతతో మెలిగే ఆశ (సోనియా ఆకుల) అనే అమ్మాయిని ఆరిఫ్, ప్రవీణ్, జీవా, చంద్ర అనే నలుగురు కుర్రాళ్ళు కాపుకాసి ఎలా మానభంగం చేశారు? అనంతరం ఆమెను చంపేసి, శవాన్ని ఎలా కాల్చేశారు? వారిని విచారించిన పోలీసులు న్యాయస్థానాలకు అప్పగిస్తే జరిగే ఆలస్యాన్ని (నిర్భయ సంఘటనను) దృష్టిలో పెట్టుకుని, సత్వర న్యాయం బాధితురాలి కుటుంబానికి అందించేందుకు ఎలా దోషులను చంపేశారన్నదే ఈ చిత్ర కథ. ఎన్ కౌంటర్ విషయంలో పోలీసుల వర్షన్ ను మాత్రమే చూపించి వదిలేకుండా, దానిపై సుప్రీం కోర్టు విధించిన ఓ కమిటీ జరిపిన విచారణ, దాని పర్యవసానం కూడా డైరెక్టర్ ఆనంద్ చంద్ర చూపించారు. ఓ వాస్తవ సంఘటనను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో జనానికి చూపుతున్నారనేది కూడా చాలా ప్రధానం. ఎందుకంటే దాన్ని బట్టే ఆ సంఘటన తాలుకు మంచి చెడుల నిర్ణయం జరుగుతుంది. ‘ఆశ’ సినిమా కూడా అలాంటిదే.
ఆశను నలుగురు ముష్కురులు మానభంగం చేయడం వాస్తవేమే, అది దారుణమే, ఆమె శరీరాన్ని కాల్చడం కూడా కీరాతకమే, అయినా… ఆ వ్యక్తులను న్యాయస్థానానికి అప్పగించకుండా, పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం ఎంత మాత్రం హర్షణీయం కాదని దర్శకుడు చెప్పాలనుకున్నాడు. అదే చూపించాడు. అయితే తన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు నియమించిన కమిషన్ అధికారి శ్రీకాంత్ అయ్యంగార్ ద్వారా చెప్పించాడు. వ్యాధి మూలాన్ని కనుక్కుని చికిత్స చేయాలి తప్పితే, పైకి కనిపించే దానిని నిర్మూలిస్తే ఫలితం ఉండదనే వాస్తవాన్ని బలంగా చెప్పాడు. క్షణికావేశం కలిగిన మెజారిటీ జనం ఈ నిర్ణయంతో ఏకీభవించకపోయినా, చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎంతమాత్రం అంగీకరించకూడదు. ఆరోజున దిశకు జరిగిన అన్యాయానికి తల్లడిల్లిపోయిన వారికి ఈ సినిమా పెద్దంత ఊరటను కలిగించదు. పైగా దోషుల కొమ్ము కాసే విధంగా ఇది ఉందనే భావన కూడా కలిగే ఆస్కారం ఉంది.
నటీనటుల విషయానికి వస్తే ఆశ పాత్రను సామాజిక సేవా రంగంలో చురుకైన పాత్రను పోషిస్తున్న సోనియా ఆకుల పోషించారు. దాంతో ఆ పాత్రలో ఆమెను ఐడెంటిఫై చేసుకునే ఆస్కారం ఏర్పడింది. తెర మీద కనిపించేది కొద్ది సేపే అయినా… కరుణ రసాన్ని చక్కగానే పోషించారామె. ఎన్ కౌంటర్ చేసే పోలీస్ అధికారిగా శ్రీధర్ రావు, సుప్రీమ్ కోర్టు కమీషన్ ఛైర్మన్ గా ఆర్జీవీ ఆస్థాన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు. ఇందులోని ఇతర ప్రధాన పాత్రలను వెంకట్, ముని, నవీన్, కళ్యాణ్, ప్రవీణ్, ప్రశాంతి చేశారు. సినిమాలో సంభాషణలు చాలా తక్కువ. వ్యక్తులు తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సిన సందర్భాలలోనూ సంగీత దర్శకుడు ఆనంద్ ఆ పని చేశాడు. ఒకే సంఘటనను రెండు కోణాలలో చూపించే చిత్రాలు గతంలో కొన్ని వచ్చాయి. కానీ ఇది నిజ సంఘటన ఆధారంగా వచ్చిన సినిమా కావడంతో జనం ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. దీనిని ఆనంద్ కంచర్ల నిర్మించారు. సినిమా ప్రారంభంలో ‘జంతువుల్ని, బడుగువర్గాలను, ఆడవాళ్ళని హింసించడం తప్పు కాదు – మనుధర్మ శాస్త్రం’ అనే వాక్యం తెర మీద కనిపిస్తుంది. దీనితో పాటే ఖురాన్, బైబిల్ లో కూడా మహిళల గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయో దర్శక నిర్మాతలు తెలిపి ఉంటే, వారు నిష్పక్షపాతంగా ఈ సినిమాను తీశారని మనం భావించొచ్చు. నాణానికి రెండో వైపు కూడా చూడమని చెప్పిన వీరు, ఈ విషయంలో మాత్రం ఒంటెద్దు పోకడే పోయారు.
ప్లస్ పాయింట్స్
దిశ ఘటనపై తీసిన చిత్రం కావడం
నటీనటుల సహజ నటన
ఆనంద్ నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
పరిష్కారం చూపకపోవడం
రేటింగ్: 2.25 /5
ట్యాగ్ లైన్: డాక్యూ డ్రామా!