Chairmans Desk: తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా రాజకీయం కొత్త పోకడలు పోతూనే ఉంది. కానీ ఎన్నిసార్లు ట్రెండ్ మారినా.. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో దిగజారుడుతనం బాగా పెరిగిపోయిన వాస్తవం కళ్లకు కడుతోంది. రాజకీయాల్లో నైతిక విలువలకు ఎప్పుడో కాలం చెల్లింది. మొన్నటిదాకా వ్యూహప్రతివ్యూహాలైనా ఉండేవి. ఇప్పుుడవీ లేకుండా పోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రాజకీయం అంటే వ్యక్తిత్వం హననం మాత్రమే. అంతకు మించి ఆలోచించటానికి కూడా పార్టీలు, నేతలు ఇష్టపడటం లేదు. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒకరకమైన జుగుప్సను, అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఎత్తులకు పైఎత్తులు, వ్యూహాలు, విమర్శలు.. వీటన్నింటినీ వదిలేసి.. కేవలం ప్రత్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయటం, ప్రత్యర్థుల కుటుంబ వ్యవహారాల్లోకి చొచ్చుకెళ్లిపోవడం చూస్తుంటే.. ఇంత దిగజారిపోవడం అవసరమా అనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈ దిగజారుడు సంస్కృతి విశృంఖలంగా పనిచేస్తోంది. ఈ విశృంఖల సంస్కృతి ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. అన్ని పార్టీలూ గుడ్డిగా ఇదే ఫార్ములాని నమ్ముకుంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి.. వాళ్ల ప్రతిష్ఠని బజారుకీడ్చాలి. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అనే హేయమైన సూత్రాన్ని ప్రయోగిస్తున్నాయి పార్టీలు. అంగబలం, అర్ధబలం, పరస్పర వ్యూహాలు.. ఎత్తుగడలు, ఇవి సరిపోవడం లేదు. ప్రత్యర్థి పార్టీని జనంలో చులకన చేయాలంటే.. భ్రష్టు పట్టించాలంటే ఏకైక మార్గం వాళ్ల వ్యక్తిగత జీవితాల్ని, కుటుంబంలో మనస్పర్థల్ని, మొత్తంగా రోడ్డెక్కించేసి.. ప్రజల ముందు వీలైనంతగా వాళ్ల వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయటమే టార్గెట్గా పెట్టుకున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్.. పార్టీలు ఇప్పుడు అదే పనిమీద ఉన్నాయి. ఉచితానుచితాలు, నైతిక విలువలు, వ్యక్తిత్వాలు.. ఇవన్నీ అనవసరం. ప్రత్యర్థి రాజకీయ పార్టీ కుటుంబ వ్యవహారాల్ని.. వ్యక్తిగత బలహీనతల్ని, అవాస్తవాల్ని, అపోహల్ని వీటన్నింటినీ.. రోడ్డు మీదకు లాక్కురావాలి. వాళ్లని అవమానాల పాలు చేయాలి. తద్వారా ప్రజల దృష్టిలో క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయడం ద్వారా ఎన్నికల్లో మనం గెలవాలి. అవతలివాడి కుటుంబం ఎలా విచ్ఛిన్నం అయినా మనకు అనవసరం. మనకు కావాల్సింది గెలుపు. ఆ గెలుపు కోసం వ్యక్తిత్వ హననాన్నే ప్రధానాస్త్రంగా ప్రయోగించాలి. ఇలాంటి నీచమైన సూత్రాన్ని నమ్ముకుంటున్నాయి రాజకీయ పార్టీలు.
రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాలుంటాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలు కూడా ఉంటాయి. కానీ కాలం మారుతున్నకొద్దీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. పూర్తిగా దారితప్పిపోయాయి. సద్విమర్శలు, ఆరోపణలు, పరిధిని దాటి.. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కుట్రలు, కుతంత్రాలు.. వ్యక్తిగత హననాలు, ఏకంగా కుటుంబాల్నే రోడ్లెక్కించటాలు.. ఇవీ ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు. ఆమాటకొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దురంధరులు లేరనీ కాదు. రాజకీయ వ్యూహచతరుతకు కొదువ లేదనీ కాదు. కానీ అవన్నీ ఒకప్పటి మాటలే. ఇప్పటికైతే క్యారెక్టర్ అస్సాసినేషన్ను మించిన రాజకీయ సూత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం నడుస్తున్న తీరు చూసి.. అసలు ఈ రాజకీయాలు ఎందుకిలా అయిపోయాయనే ఆవేదన కలగటం సహజం. ఎందుకంటే గతంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి. సరికొత్త వ్యూహాలకు కేంద్రంగా నిలిచాయి. అంతకాదు అసలు సిసలు రాజకీయం ఎలా ఉండాలో.. చూపిన ఘనత కూడా తెలుగు రాజకీయానిదే. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు, నేతలు రాజకీయాన్ని ఓ సహజ పరిణామ క్రమంగా మార్చారంటే అతిశయోక్తి కాదు. ఆ పోకడలే సామాన్యుల్లోనూ రాజకీయ స్పృహ పెరిగేలా చేశాయి. అలాంటి రాజకీయ దురంధరులంతా కనుమరుగైపోగా.. ఇప్పుడు కేవలం ప్రత్యర్థుల కుటుంబాల్ని బజారుకీడ్చే నేతలే గొప్పగా చలామణీ కావటమే అసలు సిసలు విషాదం.
మొదట్నుంచీ మిగతా రాష్ట్రాల్లో రాజకీయానికీ, తెలుగు రాజకీయానికీ చాలా తేడా ఉంది. ఇక్కడ చాలావరకు రాజకీయ వ్యూహాలను సామాన్యులు అర్థం చేసుకుంటారు. కాబట్టి పార్టీలైనా, నేతలైనా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మొన్నటిదాకా అన్ని పార్టీలూ అలాగే ఉండేవి. ప్రజలేమనుకుంటారో అనే భయభక్తులతో నడుచుకునేవి. కానీ ఇప్పుడు పార్టీలు, అన్ని పరిధులూ దాటేశాయి. జనం గురించిన ఆలోచనే మానేశాయి. ఎవరేమనుకున్నా పర్లేదు. గెలుపే పరమావధి అన్నట్టుగా నేతలు కూడా రెచ్చిపోతున్నారు. వ్యూహాల సంగతి పక్కనపెట్టేసి.. పూర్తిగా వ్యక్తిగత హననాన్నే నమ్ముకుంటున్నారు. అదేమంటే సూక్ష్మంలో మోక్షం అంటున్నారు.
ఇంకాస్త లోతుకు వెళ్తే.. రాజకీయం ఎప్పుడూ ఆషామాషీ వ్యవహారం కాదు. రాజకీయం చేయాలంటే కేవలం వ్యావహారిక జ్ఞానం ఉంటే సరిపోదు. సమకాలీన సమస్యలతో పాటు గత చరిత్ర, భవిష్యత్ అంచనాలపై సరైన అవగాహన ఉండాలి. అలాగే వ్యూహాల విషయంలోనూ కాస్త బుర్రకు పదును పెట్టాల్సి ఉంటుంది. కానీ అంత కష్టపడటానికి ఇప్పుడు నేతలకు మనసు రావడం లేదు. అందుకే వ్యూహాలు, ప్రతివ్యూహాల్లాంటి వాటి జోలికి పోవడం లేదు. పైగా అదో సంక్లిష్టమైన వ్యవహారం. అదే వ్యక్తిత్వ హననం చేయడమైతే చాలా తేలిక. ఎన్ని విమర్శలొచ్చినా.. ఒక్క మాటతో తిరుగులేని జవాబు చెప్పొచ్చు. అప్పుడు ప్రత్యర్థులే చచ్చినట్టు ఓ అడుగు వెనక్కివేస్తారు. అందుకే నేతలు తెగ రెచ్చిపోతున్నారు. ఏ సబ్జెక్ట్ ప్రస్తావన వచ్చినా.. మొదట నీ సంగతేంటి అనే ప్రశ్నతోనే కౌంటర్ మొదలవుతోంది. ఈ దెబ్బతో కొందరు నేతలు అసలు మాట్లాడటానికీ సంకోచించాల్సిన దుస్థితి నెలకొంది.
మొత్తంగా రాజకీయం అంతకంతకూ దిగజారిపోతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో చేయకూడని పనులు.. ఇప్పుడు వ్యూహాలుగా చలామణీ అవుతున్నాయి. అంతేకాదు ప్రత్యర్థులతో రాజకీయంగా విభేదించాలే కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదన్న కట్టుబాట్లు కూడా పూర్తిగా కట్టుదాటిపోయాయి. పైగా వ్యక్తిత్వ హననమే ప్రధానాస్త్రంగా పార్టీలు చెలరేగిపోతున్నాయి. నేతలు కూడా ఒకర్ని చూసి మరొకరు అదే బ్రహ్మాస్త్రమనుకుని ప్రయోగిస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఎలాగైనా గెలవాలి, గెలటానికి ఏం చేసినా తప్పు కాదనే ధోరణి.. నేతల్ని అన్ని హద్దులూ దాటేలా చేస్తోంది. వ్యక్తిత్వ హననం విషయానికి వచ్చేసరికి అందరూ ముద్దాయిలే.. అందరూ బాధితులే అనే దుస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఏ పార్టీ తక్కువ తినలేదు. ఏ నాయకుడూ మడికట్టుకుని కూర్చోలేదు. ఎవరికి వారే ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చటానికి పోటీపడుతున్నారు. అదేమంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించిన గెలుపు సూత్రం లేదని కొత్త భాష్యాలు చెబుతున్నారు.

