Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chairman’s Desk: ఇళ్లలో రెండు దీపాలు వెలిగించడం సహజం. ఆలయాల్లో మరికొన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తారు. కార్తీకమాసంలో చాలా క్షేత్రాల్లో లక్ష దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే చరిత్రలో వినని.. కనని ఉత్సవం 2012లో ఆవిష్కృతమైంది. దీపోత్సవమంటే ఒక రోజులో ఒక పూటలో ముగిసిపోయేది కాదనేది మా ఆలోచన. భక్తి టీవీ నిర్వహించే దీపోత్సవం చిరస్థాయిగా నిలిచిపోవాలని, భావితరాలు అనుసరించాలనేది మా సంకల్పం. అందుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న మహాదీపయజ్ఞమే భక్తిటీవీ కోటిదీపోత్సవం. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామగ్రి.. ఇలా ప్రతిదీ ఉచితంగా సిద్ధం చేస్తున్నాం. ప్రాంగణానికి వచ్చిన భక్తులు ప్రాంగణంలో కూర్చుని ముహూర్త సమయానికి దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అతి పెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని కార్యక్రమానికి పూనుకున్నాం. కోటిదీపాలు వెలిగించడమంటే మాటలు కాదు. అది ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిది. అయితే భగవంతుడి అనుగ్రహం.. పీఠాధిపతుల ఆశీస్సులు.. కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది సహకారం వెరసి భక్తిటీవీ కోటిదీపోత్సవం నభూతోనభవిష్యతి అనే రీతిలో పదిహేనేళ్లుగా నిర్విఘ్నంగా జరుగుతోంది. చరిత్రలో తొలిసారి కోటిదీపాలు వెలిగించడంతో అసాధ్యం సుసాధ్యమైంది. ప్రసార మాధ్యమాల చరిత్ర తిరగరాస్తూ.. కొత్త అధ్యాయం మొదలైంది. అంతేకాదు ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ మంచి సంకల్పంతో మొదలుపెట్టిన భక్తి ప్రయోగాన్ని గుర్తిస్తూ.. ప్రభుత్వం కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే
ఒక దీపమే మరో దీపాన్ని వెలగించగలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే.. ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటి రోజు నుంచి మనకు కార్తీక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీపతోరణాలై వెలిగిపోతుంటాయి. దీపం…వెలుగుకు, జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందుతరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. కార్తీకంలో ప్రతి ఏటా హైదరాబాద్ లో కోటిదీపోత్సవాన్ని భక్తిటీవీ ఓ సత్సంప్రదాయంగా నిర్వహిస్తోంది. 2012లో ప్రారంభించిన దీపోత్సవం తెలుగువారి అభిమాన కార్యక్రమంగా రూపుదాల్చటం మనకు మహాదేవుడు అందించిన వరంగా భావిస్తున్నాం. ఇటువంటి వేడుక న భూతో న భవిష్యతి అన్నంతగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. దీని వెనుక అశేష భక్తజనుల ఆదరణ ఉంది. ఈ ఏడాది కూడా ఈ సత్సంప్రదాయాన్ని నవంబర్ 14 నుంచి 30 వ తేదీ వరకు.. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి నిర్వహించనున్నాం. పదిహేనేళ్లుగా కొనసాగుతున్న ఈ దీప యజ్ఞం.. మొదట లక్షదీపోత్సవంగా మొదలై.. తర్వాత కోటిదీపోత్సవ రూపాన్ని సంతరించుకుంది. తొలిరోజుల్లో దేశవ్యాప్తంగా.. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ దీపోత్సవంగా పేరుగాంచింది.
Also Read
- Chairman's Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
- Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
- Chairman's Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
కార్తీకమాసంలో అనేకానేక క్షేత్రాల్లో దీపోత్సవాలు జరిగేవి. కానీ చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. హుండీలు లేకుండా ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామగ్రి, ఇలా ప్రతిదీ ఉచితంగా ఇస్తున్నాం. దీపం అంటే ప్రమిదలో నూనెపోసి.. వత్తివేసి.. అగ్ని వెలిగించటం కాదు. దీపం దైవానికి ప్రతిరూపం. దీపారాధనతో దైవసాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి, భగవంతునికి అభేదం చూపేందుకు ప్రతిరోజూ దీపం వెలిగించిమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపం వెలిగించటానికి మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. ఇటువంటి పుణ్యఫలితం ప్రతి ఒక్కరికీ దక్కాలనే ఆధ్యాత్మిక సంకల్పానికి ప్రతిరూపమే భక్తి టీవీ కోటిదీపోత్సవం.
కోటిదీపాలు వెలిగించడమంటే మాటలు కాదు. నిప్పుతో చెలగాటమాడుతున్నారని నోళ్లు నొక్కుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ముక్కోటి దేవతానుగ్రహం, జగద్గురువుల ఆశీస్సులు, భక్తుల సహకారం కార్యక్రమం ప్రణాళిక, సిబ్బంది అంకితభావం వెరసి ప్రతి ఏటాఅద్భుతరీతిలో కార్యక్రమం కొనసాగుతోంది. నకార్తీక సమం మాసః. న కృతేన సమం యుగం. న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం. కార్తీకంతో సమానమైన మాసం, కృతయుగంతో సమానమైన యుగం. వేదంతో సమానమైన శాస్త్రం. గంగతో సమానమైన తీర్థం లేవు. కార్తీకంలో మూడు పొద్దులూ పవిత్రం. దానికి మూడు ఆకుల మారేడుదళం సాక్ష్యం. శివనామం పవిత్రం. కార్తీకంలో దీపం పుణ్యప్రదం. ఉపవాసం మోక్షప్రదం. శివనామం కైవల్యకారణం. ముక్తికి సోపానం. జీవితసారం జ్ఞానదీపంలా ప్రకాశించాలి. భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మేలా గుండె గుడిలో వెలగాలి. ఆద్యంతం ఆధ్యాత్మికం. అణువణువూ భక్తిభావం. ప్రతి దీపం ప్రణవస్వరూపం. ప్రతి అణువూ శివమయం. అద్భుతం అనిర్వచనీయం. అఫూర్వం. అనితరసాధ్యం. అరుదైన ఆవిష్కరణ. కోటిదీపాల తోరణం. మనసునిండా దైవాన్ని నింపుకున్న భక్తకోటికి ఇదే మా ఆహ్వానం.
ఈ విశ్వమే మహా శివలింగం. దీనిని వెలిగించే దీపం శివుడే. అనేక కోట్ల సూర్యులనే దీపాలతో కూడిన విశ్వాన్ని తాను వెలిగిస్తే.. శివుడు మహాదీపం అవుతున్నాడు. అటువంటి శివుని ముందు కార్తీకమాసంలో దీపారాధన చేస్తే.. శివలోకమే లభిస్తుందని లింగాష్టకం చెబుతోంది. ఏటా కార్తీక మాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలు అందిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహభాషణ పూర్వక ఆశీస్సులు అందిస్తున్నారు. అతిరథ మహారథులు అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో వేలాది మంది ప్రజలు వెలిగించిన కోటి దీపాలు వెలుగుతుంటే.. భక్త కోటి తన్మయమవుతుంది. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పక్షాన ఉచితంగా అందిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా ఇటువంటి కార్యక్రమం ఇదొక్కటే.. అన్నరీతిలో అందరి ప్రశంసలు అందుకుంటూ ఏటికేడాది సరికొత్త హంగులతో నవనవోన్మేషంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం జరుగుతోంది.
జ్యోతి ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపం ఎల్లెడలా ప్రకాశిస్తుంది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. ఆ పరమాత్మ అనే జ్యోతి వల్లనే ఈ జగత్తు, సూర్యచంద్రులు వెలుగుతున్నారు. ఈ పరమాత్మ అనే జ్యోతి లేకపోతే అంతా అంధకారమైపోయేది. అందుకే భారతీయ సంస్కృతిలోజ్యోతికి అంత ప్రాధాన్యత. అందువల్లే మనకు దీపారాధన సంప్రదాయమైంది. మనం భగవంతుణ్ణి తమసోమా జ్యోతిర్గమయ అని ప్రార్ధించాలని ఉపనిషత్తులు చెప్పాయి. తమస్సు నుంచి ఉషస్సులోకి తీసుకెళ్లమని మనం పరమాత్మను ప్రార్ధిస్తాం. నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని దాని అంతరార్ధం. అంధకారం అజ్ఞానానికి ప్రతీక. జ్యోతిస్సు జ్ఞానానికి ప్రతీక. మనలోని అజ్ఞానాంధకారం నివృత్తి కావాలి. మనలో జ్ఞానజ్యోతులు వెలగాలి. ఆ విధమైన జ్ఞానం కలగాలని దేవుడ్ని ప్రార్ధిద్దాం. ఆ దివ్యజ్యోతిని చూస్తుంటే మనకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మన సంస్కృతిలో జ్యోతి ప్రజ్వలనకు విశేష స్థానం ఉంది. ఏదైనా కార్యక్రమం జ్యోతి వెలిగించి ప్రారంభించడం మన సంప్రదాయం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం జన్మరాహిత్యానికి మార్గం చూపుతుందని కార్తీక పురాణం చెబుతోంది.
ఒకప్పుడు కార్తీక మాసమంటే ఏదో పౌర్ణమి రోజు దీపం పెట్టుకోవడం తప్ప.. ఓ సాదాసీదా పండుగలా గడిచిపోయేది. కానీ భక్తి టీవీ కోటి దీపోత్సవం.. దీపోత్సవం అవసరం, దీపారాధన ప్రాధాన్యం.. సాంస్కృతికంగా, శాస్త్రీయంగా.. వీటికున్న ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లింది. కోటి దీపోత్సవం ప్రభావంతోనే ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి ఇంటా కార్తీక మాసంలో దీపం పెట్టడమనేది తప్పనిసరి ఆచారంగా మారింది. నిజానికి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆచారం ఈరోజు కొత్తగా వచ్చినది కాదు. సనాతనవాదులుగా ప్రచారం చేసుకుంటున్నవారు తెచ్చిన ఆచారమూ కాదు. ఇది యుగయుగాలుగా , తరతరాలుగా జనం ఆచరిస్తున్న సంప్రదాయమే. ఈరోజు మతతత్వ సంస్థలు, నయా సనాతనవాదులు ప్రచారం చేసుకుంటున్నట్టుగా కాదు. కార్తీక మాసంలో ఇంటింటా దీపం పెట్టడమనేది హిందూ సంస్కృతి తొలినాళ్ల నుంచే ఉంది. దీనిని జనానికి గుర్తుచేస్తూ అంతరించిపోతున్న మన సంస్కృతిని పునరుద్ధరింపజేసి.. ఇంటింటా మళ్లీ దీపాలు వెలిగించింది భక్తి టీవీ కోటి దీపోత్సవం.
హైందవ సంస్కృతికి పట్టాభిషేకం చేసే ఉద్దేశంతో.. సనాతన సంప్రదాయాల్ని నేటి తరానికి గుర్తుచేసే మహోన్నత ఆశయంలో తొలి దక్షిణ భారత ఆధ్యాత్మిక ఛానల్ గా భక్తి టీవీ ప్రారంభమైంది. భక్తి టీవీ రాకతో తెలుగునాట భక్తి ఉద్యమం వచ్చింది. పూజల దగ్గర్నుంచీ పురాణాల వరకూ హిందూ సంప్రదాయాన్ని సుసంపన్నం చేసే ప్రతి అంశాన్ని భక్తులకు పరిచయం చేస్తూ భక్తి టీవీ ప్రస్థానం సాగింది. ఇక హైందవ సంస్కృతిలో కీలకమైన దీపారాధన ఘట్టానికి పట్టం కడుతూ.. కోటి దీపోత్సవానికి రూపకల్పన చేసింది భక్తి టీవీ. కోటి దీపోత్సవం పేరుతో భక్తి టీవీ.. సరికొత్త అధ్యాయానికి తెరతీసిందనే చెప్పాలి. భక్తి టీవీ కోటి దీపోత్సవం మొదలుపెట్టిన తర్వాత.. తెలుగురాష్ట్రాల్లో ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివెరియడంలో భక్తి టీవీ తన వంతు పాత్ర పోషించింది. భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచుతూ.. తాను కూడా పెరిగింది భక్తి టీవీ.
క్షేత్రాల్లో ఏమైనా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, జాతరలు జరుగుతున్నప్పుడు వాటికి ప్రతి ఏడాదీ హాజరుకావడం భక్తలకు రివాజుగా మారుతుంది. అదే సంప్రదాయం భక్తి టీవీ కోటి దీపోత్సవంలోనూ కొనసాగుతోంది. ఇది కేవలం వేడుక అయినప్పటికీ కార్తీకమాసం రాగానే భాగ్యనగర వాసుల చూపు ఎన్టీఆర్ స్టేడియం వైపే ఉంటుంది. కోటిదీపోత్సవ ప్రాంగణం నేలకు దిగిన చిరుకైలాసంలా సింగారించుకుంటుంది. జంటనగరాల్లోని అన్నిదారులూ కోటి దీపోత్సవానికి నడిపించగా.. భక్తజనం పిల్లాపాపలతో తరలివస్తారు. పూలముగ్గులతో తీర్చిదిద్దిన ప్రాంగణం ముత్తైదువులతో కళకళలాడుతుంది. వందలాది మంది వలంటీర్లు తరలివస్తారు. భజనల, కోలాట బృందాలు ప్రాంగణమంతా కలియదిరుగుతూ మరింత వన్నె తెస్తారు. వారే కొన్ని వేలాదిమంది ఉంటారంటే ఆశ్చర్యం కలగకమానదు.
వ్యక్తిగతంగా చేసుకునే ఆరాధనల కంటే సామూహికంగా చేసే కార్యక్రమాల వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు కళారూపాలు ప్రదర్శించి అర్ధం కాని జటిలమైన విషయాలను ఈ వేదిక నుంచి ప్రజలకు చేరవేయడం మహత్కార్యం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల వెయ్యి సోమయాగాలు, అగ్నిష్టోమ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. దీపం పవిత్రంగా ఉండటమే కాదు.. దీపాన్ని చూసినందువల్ల ప్రశాంతత, సౌందర్యం అనుభూతించగలం. దీపాన్ని ప్రజ్వలిపంజేసి ఆ కాంతిలో శాస్త్రవిషయాలు మాట్లాడుకుంటే వినటానికి సౌందర్యం. పవిత్రత రెండూ సిద్ధిస్తాయి.
కోటి దీపోత్సవ ప్రభావంతో తెలుగునాట ప్రతి ఆలయంలో ఈరోజు కార్తీకమాసంలో దీపోత్సవం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రభావంతో.. కార్తీకమాసంలో దీపోత్సవాలు చేస్తున్నాయి. ఇలా దీపారాధన సంస్కృతికి తాను పట్టం కట్టడమే కాకుండా.. అందరిలోనూ ఆ సనాతన స్ఫూర్తిని నింపింది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కార్తీకంలో దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా, మరొకరు వెలిగించిన దీపాన్ని కళ్లకద్దుకున్నా, నమస్కరించినా మంచిదేనని పండితులు చెబుతారు. కార్తీకం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా.. శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏక బిల్వం శివార్పణం అంటూ కార్తీకంలో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు. ఓం నమశ్శివాయ అంటూ కాసిన్ని నీళ్లు శివలింగంంపై పోయగలిగితే చాలు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి, భుజింపగలిగితే చాలు. హరోంహర శంకరా అంటూ ఈ నెల రోజుల్లో ఒక్కరోజైనా పుణ్యనదుల్లో మునకవేస్తే చాలు. సమస్త తీర్థాలు, క్షేత్రాలు సేవించిన ఫలం.. సాధుసత్పురుషుల్ని దర్శించిన ఫలం అన్నింటినీ మనకు కార్తీకమే అందిస్తుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
-
Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!