Special Story on Tulsi Tanti: సాధారణంగా ఒక వ్యక్తికి మహాఅయితే ఒకటీ రెండు విశేషణలు మాత్రమే ఉంటాయి. కానీ ఏకంగా ఆరేడు విశేషణలు ఉన్నాయంటే వాటిని బట్టే ఆయన గొప్పతనమేంటో తెలిసిపోతుంది. ఇండియాలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా నిలవటమే కాకుండా క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయనే తుల్సి తంతి. విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. గ్రీన్ ఎనర్జీ ఎక్స్‌పర్ట్. ఫాదర్ ఆఫ్ రెనివబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ. ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్. హీరో ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్. పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియాస్ విండ్ ఎనర్జీ సెక్టార్. ‘సుజ్లాన్ ఎనర్జీ’ కంపెనీ ఫౌండర్, సీఎండీ. ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ.
1958లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించిన తుల్సి తంతి.. కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అనంతరం టెక్స్‌టైల్ రంగంలో ఎంట్రప్రెన్యూర్‌గా జర్నీ ప్రారంభించారు. అయితే ఆ వ్యాపారాన్ని విద్యుత్ కొరత దెబ్బతీయటంతో పునరుత్పాదక ఇంధన రంగంపై దృష్టి పెట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా ఆ సెక్టార్‌లో కొన్ని కంపెనీలు తమదైన శైలిలో దూసుకుపోతుండగా అలాంటి తీవ్రమైన పోటీలో కూడా ఒక భారతీయుడు ప్రవేశించి విజయవంతం కావటం విశేషమే. తద్వారా తుల్సి తంతి ఇండియాలోని విండ్ ఎనర్జీ సెక్టార్‌కి పోస్టర్ బాయ్‌గా నిలిచారు.
తుల్సి తంతి 1990ల్లోనే రెనివబుల్ ఎనర్జీ ఫీల్డ్‌లోని అపార అవకాశాలను గుర్తించటం ఆయన ముందుచూపుకి నిదర్శనమని చెప్పొచ్చు. భవిష్యత్‌పై పూర్తి స్థాయిలో స్పష్టత కలిగిన ఆయన 1995లో సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థను స్థాపించారు. మన దేశంలో గాలిమరల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 8,535 కోట్లకు పైగానే ఉండటం విశేషం. తుల్సి తంతికి పునరుత్పాదక విద్యుత్ రంగంపై నమ్మకం కలగటంతో 2001లో టెక్స్‌టైల్ బిజినెస్‌ని విక్రయించి తర్వాత దానిపైనే ఫోకస్ పెట్టారు.
2003లో అగ్రరాజ్యం అమెరికాలోని మిన్నెసోటాకి చెందిన ఒక సంస్థ నుంచి 24 విండ్ టర్బైన్‌ల కోసం ఫస్ట్ ఆర్డర్ రావటం సుజ్లాన్ కంపెనీకి మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత కాలంలో సుజ్లాన్ ఎనర్జీ.. ఇండియాలోనే అతిపెద్ద విండ్ పవర్ కంపెనీగా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ సంస్థ.. మొత్తమ్మీద 19.4 గిగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో 33 శాతం వాటాను అంటే 19,200 మెగావాట్ల కెపాసిటీని కైవసం చేసుకుంది. ప్రస్తుతం 17 దేశాల్లో సేవలు అందిస్తోంది.
ప్రపంచంలోని రెండో అతిపెద్ద విండ్ పవర్ మార్కెట్ అయిన అమెరికాలో కూడా సుజ్లాన్ ఎనర్జీ 2 గిగివాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. బెల్జియంలోని టర్బైన్ స్పేర్ పార్ట్స్ కంపెనీ జెడ్‌ఎఫ్ పవర్ యాంట్‌వెర్పన్‌కి తుల్సి తంతి 2006 నుంచి చైర్మన్‌గా ఉన్నారు. ఇండియాలోని గాలిమరల తయారీ సంస్థల సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. దేశ ఆర్థిక పురోగతికి తన వంతు తోడ్పాటు అందించారు. సుజ్లాన్ ఎనర్జీ 2005లో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు అయింది. అప్పట్లో ఒక్కో షేరు విలువ 510 రూపాయలుగా పలికింది. అనంతరం శరవేగంగా కార్యకలాపాలను విస్తరించింది.
సుజ్లాన్ ఎనర్జీ ఒకానొక దశలో 65,474 కోట్ల రూపాయల మార్కెట్ వ్యాల్యూని సాధించింది. ఈ సంస్థలో 70 శాతం వాటాలు గల తుల్సి తంతి సంపద సుమారు 43,537 కోట్లుగా నమోదైంది. విండ్ టర్బైన్లకు కావాల్సిన గేర్‌లను రూపొందించటంలో బెల్జియంలో లీడింగ్‌లో ఉన్న హాన్‌సెన్ ట్రాన్స్‌మిషన్ ఇంటర్నేషనల్‌ను 465 యూరోలకు కొనుగోలు చేశారు. 2007లో జర్మనీకి చెందిన ఆఫ్‌షోర్ విండ్ టర్బైన్ల తయారీ సంస్థ ఆర్‌ఈ పవర్ సిస్టమ్స్‌ను 1.4 బిలియన్ యూరోలకు అక్వైర్ చేసుకున్నారు. అయితే తుల్సి తంతి ఈ సంస్థలను అప్పుచేసి కొనటం ఆయనకు కలిసి రాలేదు.
ఈ కంపెనీ టర్బైన్లలో లోపాలు ఉన్నాయంటూ కంప్లైంట్లు వెల్లువెత్తాయి. 2008లో అంతర్జాతీయ ఆర్థికమాంద్యం, తదనంతర పరిణామాలతో పవన విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ ఒడిదుడుకులకు లోనైంది. కంపెనీ విలువ 8,536 కోట్లకు పడిపోయింది. 2015 నాటికి లోన్లు తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. అంతకుముందు సంవత్సరమే సెన్‌వెన్ ఎస్‌ఈగా పేరు మార్చిన ఆర్‌ఈ పవర్ సిస్టమ్స్‌ని అమ్మేశారు. దివాలా తీసే దశ నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి 2020లో ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 15 బ్యాంకుల కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
కంపెనీలోని 5 శాతం ఈక్విటీని 3,500 కోట్ల రూపాయలకి బ్యాంకులకు అప్పగించారు. అయినప్పటికీ సుజ్లాన్ ఎనర్జీకి ఇంకా 12 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఉండిపోయాయి. అందువల్ల వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు ఇతర ఖర్చుల కోసం నిధులను సమకూర్చుకునేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి సుజ్లాన్ ఎనర్జీ 12 వందల కోట్ల రైట్స్ ఇష్యూకి తెర తీసింది. ఇలాంటి కీలకమైన, కష్టమైన సమయంలోనే తుల్సి తంతి దురదృష్టవశాత్తూ భౌతికంగా దూరమయ్యారు.