ఒక ఏడాదిలో బ్యాంకుల నుంచి రూ.20 లక్షలకు మించి విత్‌డ్రా లేదా డిపాజిట్ చేస్తే ప్రజలు కచ్చితంగా పాన్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే. కో ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కరెంట్ ఖాతా ఓపెన్ చేస్తున్నప్పుడూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.
Read Also: Modi Hyd Tour : మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు..
ఎవరైనా అధిక విలువ గల లావాదేవీలు చేయాలనుకున్నప్పుడు, వారికి పాన్‌కార్డ్ లేకపోతే ఆధార్ నెంబర్ ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఒక రోజులో 50 వేలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ కార్డు అవసరం అయ్యేది. 114బీ నిబంధన పరిధిలో ఉన్నందున ఏడాది కాలంలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రావల్స్‌పై పరిమితి ఉండేది కాదు. అంతేకాకుండా బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తించేది.
ఒకవేళ బ్యాంకులో ఏడాదిలో రూ.20 లక్షలకు మించి డిపాజిట్ లేదా విత్‌డ్రావల్ చేసినప్పుడు పాన్ లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. వారం రోజుల్లోగా దరఖాస్తు చేస్తామని ధ్రువీకరించాలి. ఆర్థిక నేరాలు, మోసాలు అరికట్టేందుకు, అత్యధిక విలువగల లావాదేవీలను పన్నుల శాఖ పర్యవేక్షించేందుకు ఈ నిబంధనలు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా నగదు లావాదేవీలను గమనించేందుకూ ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా తప్పించుకునే వారిని కట్టడి చేసేందుకు వీలవుతుందని అంటున్నారు.