జులై 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీ, బిల్లింగ్, అప్ గ్రేడ్, క్లోజింగ్ విషయంలో కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. వినియోగదారులకు మేలు చేసేలా కేంద్ర రిజర్వుబ్యాంకు వీటిని రూపొందించింది. కొత్త నియమాలు భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరికీ కొత్త రూల్స్ వల్ల ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు కొత్త కార్డులు మంజూరు చేయాలన్నా, ఉన్న కార్డులను అప్ గ్రేడ్ చేయాలన్నా వినియోగదారుడి అనుమతి తీసుకోవాల్సిందే. వినియోగదారుల అనుమతి లేకుండా కొత్తకార్డులు మంజూరు చేసినా, అప్ గ్రేడ్ చేసిన తర్వాత ఛార్జీలు వసూలు చేసినా.. బ్యాంకులే ఆ బిల్లును తిరిగి వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ ఛార్జీలకు రెట్టింపు మొత్తం జరిమానాగా వినియోగదారుడికి చెల్లించాలి. ఈ విషయంలో ఏమైనా ఫిర్యాదులు చేయాల్సి వస్తే కస్టమర్లు అంబుడ్స్ మన్ ను సంప్రదించవచ్చు. అంతేకాదు క్రెడిట్ కార్డు ఉచితం అని చెప్పాక బ్యాంకులు ఎలాంటి ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు.క్లోజ్ చేయకపోయినా ఫైన్ క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని వినియోగదారులు బ్యాంకులను కోరితే.. ఏడు రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజులు పూర్తయినా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయకపోతే.. 8వ రోజు నుంచి రోజుకు రూ.500 చొప్పున ఫైన్ చెల్లించాలి. ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజుల పాటు వినియోగదారుడికి ఫైన్ కట్టక తప్పదు.
క్రెడిట్ కార్డు క్లోజ్ చేశాక అందులో ఇంకా బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలి. ఒక వేళ బ్యాంకు వివరాలు లేకపోతే.. కస్టమర్‌ను అడిగి తీసుకోవాలి.బిల్లింగ్ సైకిల్ తేదీల్లో మార్పుఇకపై క్రెడిట్ కార్డులు బిల్లింగ్ తేదీల సైకిల్ గత నెల 11 నుంచి ప్రస్తుత నెల 10 వరకు పరిగణనలోకి తీసుకోవాలి. వినియోగదారులు ఈ బిల్లింగ్ తేదీలను మార్చుకోవాలనుకుంటే అందుకు ఒకసారి అవకాశం ఇవ్వాలి.
క్రెడిట్ కార్డు సంస్థలు వినియోగదారులకు తప్పుడు బిల్లులు పంపడానికి వీల్లేదు. ఒకవేళ వినియోగదారుడి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే బిల్లుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు, పత్రాలను సంబంధిత సంస్థ 30 రోజుల్లోగా చూపించాల్సి ఉంటుంది.ఆన్లైన్ పేమెంట్లు చేసే సమయంలో అక్రమాలకు తావు ఇవ్వకుండా టోకనైజేషన్ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల కార్డు డేటాకు మరింత భద్రత ఉంటుందని తెలిపింది. టోకెన్ కార్డ్ కావాలి అనుకునే వారు బ్యాంకు వెబ్సైట్ లేదా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకొని పొందవచ్చు. ఈ టోకెన్ ను వ్యాపారి సంబంధిత క్రెడిట్/డెబిట్ కార్డు జారీ చేసే బ్యాంకుకు పంపిస్తారు.