Infosys Narayana Murthy Inspirational story: ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటదంటారు. దీనికి చక్కని ఉదాహరణగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతుల గురించి చెప్పుకోవచ్చు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన
నారాయణమూర్తి.. భారతీయ ఐటీ రంగానికి పితామహుడిగా ఎదగటంలో ఆయన భార్య సుధామూర్తి కీలక పాత్ర పోషించారు. సతీమణి ఇచ్చిన మనీతో సొంతగా కంపెనీ పెట్టి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించటం ద్వారా ఎంతో మంది ఎంట్రప్రెన్యూర్లకి ఆదర్శంగా నిలిచిన ఆయనే ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ.
read more: Super Success Story: ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక ఇంటర్వ్యూ. వహ్‌వా అనిపించే విజయగాథ
నాగవర రామారావ్ నారాయణమూర్తి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే మాత్రం తెలియనివారు ఉండరు. ఎందుకంటే ఆయన.. ‘‘ఫాదరాఫ్ ఇండియన్ ఐటీ సెక్టార్’’గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 40 ఏళ్ల కిందటే ఎంట్రప్రెన్యూర్‌గా కెరీర్‌ని కొత్త దారిలోకి మళ్లించి మరపురాని విజయాలను సొంతం చేసుకున్నారు. తద్వారా లక్షల మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. కృషి, పట్టుదల, వినయ విధేయతలకు మారుపేరుగా మారారు.
ఇన్ఫోసిస్ కంపెనీ ఏర్పాటుతో మన దేశంలో టెక్నాలజీ మరియు ఆర్థికాభివృద్ధికి, పురోగతికి పరోక్షంగా బాటలు పరిచిన ఎన్.ఆర్.నారాయణమూర్తి లైఫ్ జర్నీ కర్ణాటకలోని మైసూర్‌లో ప్రారంభమైంది. 1946 ఆగస్టు 20న మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. బాల్యంలో ఎన్నో కష్టాలకోర్చి విద్యాభ్యాసం చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. ఆ క్రమంలో మైసూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. పీజీ కోర్సును ఐఐటీ కాన్పూర్‌లో చదివారు.
ఉన్నత విద్య పూర్తయ్యాక నారాయణమూర్తి ఐఐఎం అహ్మదాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. అక్కడే చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా ప్రమోషన్ పొందారు. ఫలితంగా.. ఇండియాలోనే మొట్టమొదటి షేరింగ్ కంప్యూటర్ సిస్టమ్‌లో పనిచేసే అవకాశాన్ని పొందటం విశేషం. ఆ సమయంలో నారాయణమూర్తి ఈసీఐఎల్ కంపెనీ కోసం బేసిక్ ఇంటర్‌ప్రిటర్‌ని రూపొందించి వాడుకలోకి తెచ్చారు. ఉద్యోగ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ సొంతగా సంస్థను స్థాపించాలనే కోరిక నారాయణమూర్తిలో రోజురోజుకీ బలపడుతూ వచ్చింది.
ఎంట్రప్రెన్యూర్‌గా తననుతాను నిరూపించుకోవటం కోసం నారాయణమూర్తి విఫలయత్నాలు చేశారు. పుణేలోని సాఫ్ట్రానిక్స్ అనే ఒక దేశీయ ఐటీ సంస్థలో చేరారు. కానీ.. ఆ వెంచర్ మరింత కాలం మనుగడ సాగించలేకపోయింది. ప్రారంభమైన ఒకటిన్నరేళ్లకే మూతపడింది. దీంతో.. పత్నీ కంప్యూటర్ సిస్టమ్స్ అనే కంపెనీలో జనరల్ మేనేజర్‌గా జాయిన్ అయ్యారు. అప్పుడే.. సుధామూర్తిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో వివాహం నారాయణమూర్తి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పింది.
భర్త ఆశయాన్ని సుధామూర్తి సరిగ్గా అర్థంచేసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో.. ఒక సంస్థలో.. ఫుల్ టైమ్ ఉద్యోగిగా ఉంటూ సొంతగా కంపెనీ పెట్టడం, ముందుకెళ్లటం సాధ్యం కాదని గ్రహించారు. అందుకే.. తాను దాచుకున్న పది వేల రూపాయలను భర్తకు ఇచ్చి కంపెనీ పెట్టాలంటూ ప్రోత్సహించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు మూడేళ్ల సమయం ఇచ్చారు. దీంతో.. నారాయణమూర్తి ఇక వెనుదిరిగి చూడలేదు.
1981 జులై 2న ఆయన తన ఆరుగురు మిత్రులతో కలిసి పుణెలో ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి శ్రీకారం చుట్టారు. భర్త లక్ష్య సాధన కోసం సుధామూర్తి ఇంటాబయటా అన్నీ తానై సహాయ సహకారాలు అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు తమ జీవితాన్ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. రాత్రనకా.. పగలనకా.. కష్టపడి పనిచేశారు. దీంతో.. ఎట్టకేలకు నారాయణమూర్తి దంపతుల శ్రమ ఫలించింది. కుర్త్ సల్మాన్ అసోసియేట్స్ అనే సంస్థతో కలిసి జాయింట్ వెంచర్‌ని ఏర్పాటుచేయటం ద్వారా మొదటి విజయాన్ని నమోదుచేశారు.
తర్వాత.. నారాయణమూర్తి సారథ్యంలో ఇన్ఫోసిస్ అంచెలంచెలుగా, శరవేగంగా ఎదిగింది. 1990 దశాబ్ధం చివరి నాటికి ఇన్ఫోసిస్.. ఇండియాలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంపెనీల్లో ఒకటిగా పేరొందింది. ఈ నేపథ్యంలో ఆయన సామాజిక సేవ పైన దృష్టి పెట్టారు. వివిధ రంగాలకు తన వంతు సాయం అందించారు. మరో వైపు.. ఇన్ఫోసిస్ సంస్థ రెవెన్యూ 100 మిలియన్ డాలర్లకు చేరింది. అమెరికాలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో నమోదైంది.
ఇన్ఫోసిస్‌కి 21 ఏళ్ల పాటు సీఈఓగా వ్యవహరించిన నారాయణమూర్తి.. 2002లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దేశ ఐటీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను పలు అవార్డులు వరించాయి. 2000 సంవత్సరంలో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు పొందారు. 2013లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ మరియు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు వచ్చాయి. నేల విడిచి సాము చేయకపోవటం, నిరాడంబరత్వమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నారాయణమూర్తి ఇటీవల చెప్పారు.