Credit Card: క్రెడిట్ కార్డ్ వల్ల మన ఖాతాలో డబ్బులు లేకపోయినా తాత్కాలికంగా బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ డబ్బులు ముఖ్యంగా అకస్మిక అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు, టికెట్ల బుకింగ్ లు, షాపింగ్, బిల్లుల చెల్లింపులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ వల్ల ముఖ్యమైన లాభం ఏంటంటే ‘గ్రేస్ పీరియడ్’ సమయం. అంటే ఒక నిర్దిష్ట సమయం వరకూ మన వాడుకున్న మొత్తానికి వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం. ఒకవేళ ఆ గడువు మించితే మాత్రం వినియోగదారుడికి భారీగా వడ్డీ పడుతుంది. దీనివల్ల చిన్న మొత్తాలు కూడా అతి తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం నగరాల్లో ఉద్యోగంలో ఉన్న యువతలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువైంది. క్రెడిట్ కార్డ్ లిమిట్ లక్షల రూపాయలలో ఉన్నా, అవి మన డబ్బులు కావని, రుణంగా తీసుకున్నవేనని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ డబ్బును తప్పుగా ఉపయోగించుకుంటే ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉంది. ఇకపోతే, క్రెడిట్ కార్డ్ సంబంధించి మనలో చాలా మందికి ఓ ప్రశ్న మదిలో ఉండనే ఉంటుంది. అదేంటంటే.. ఒకవేళ క్రెడిట్ కార్డు పొందిన వ్యక్తి అందులోని డబ్బును వాడుకున్న తర్వాత ఒకవేళ అనుకోకుండా ఆ వ్యక్తి మరణిస్తే.. తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు ఎవరు చెల్లిస్తారని.. నిజం చెప్పండి.. మీకు కూడా ఈ ప్రశ ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఉంటుంది కదా.. మరి ఈ సందేహంకు సమాధానం తెలుసుకున్నారా..? ఒకవేళ లేకుంటే ఏం పర్వాలేదు.. సమాధానం ఇక్కడ తెలుసుకుందాము.
నిజానికి రెండు కీలక రకాల క్రెడిట్ కార్డులు ఉంటాయి. అవి అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు. ఇందులో అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే.. ఈ తరహా కార్డులు సాధారణంగా పూచీకత్తు లేకుండా వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇస్తారు. ఒకవేళ వినియోగదారు మరణిస్తే, క్రెడిట్ కార్డ్ రుణం వ్యక్తిగత బాధ్యత కింద పరిగణించబడుతుంది. కాబట్టి సాధారణంగా ఆ కుటుంబసభ్యులపై ఆ రుణ బాధ్యత ఉండదు. అదే సమయంలో బ్యాంకులు మృతుడి పేరిట ఆస్తులు, డిపాజిట్లు, బ్యాలెన్స్ ఏవైనా ఉంటే వాటిపై క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆస్తులు లేకపోతే, బ్యాంకులే ఆ రుణాన్ని మాఫీ చేసుకుంటాయి.
Read Also:Priests Dance: పూజారుల మందు పార్టీ.. అశ్లీల నృత్యాలతో రచ్చరచ్చ! వీడియోలు వైరల్
ఇక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే.. ఈ రకం కార్డులు ముఖ్యంగా క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారికి, ఆదాయం లేనివారికి బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఆధారంగా ఇస్తాయి. ఈ కార్డు వినియోగదారు మరణించినపుడు, బకాయిలను FD నుండి నేరుగా డెడక్ట్ చేస్తారు. మిగిలిన డిపాజిట్‌ను వారసులకు ఇస్తారు. కాబట్టి ఇక్కడ రుణ మాఫీ అవకాశం ఉండదు. కాబట్టి, క్రెడిట్ కార్డులు ఆర్థిక అవసరాల సమయంలో సహాయపడే మంచి సాధనాలు. వాటిని జాగ్రత్తగా, సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతనిన ఉంది. వినియోగదారుడు మృతిచెందినప్పుడు, ఆ క్రెడిట్ బకాయి పరిస్థితులు ఆ కార్డు రకం, వ్యక్తిగత ఆస్తుల ఆధారంగా మారుతాయి.