Off The Record: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో యాక్టివ్‌గా ఉండడానికి వైసీపీ నేతలు అస్సలు ఇష్టపడడం లేదట. 2024 ఎన్నికల ముందు ఇంకేముంది…. అధికారం మనదే….., మన నాయకురాలు డిప్యూటీ సీఎం అయిపోతున్నారంటూ నానా హంగామా చేసిన నాయకులు ఇప్పుడసలు పత్తా లేకుండా పోయారట. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ నాడు రచ్చ చేసిన వాళ్ళలో ఒక్కరి మాట కూడా నేడు నియోజకవర్గంలో వినిపించడం లేదని అంటున్నారు. పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమం చేయమని ఆదేశిస్తే… అటువైపు తిరిగి కూడా చూడడం లేదట ద్వితీయ శ్రేణి నేతలు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్స్, వివిధ కార్పొరేషన్స్ ఛైర్మన్లు అయితే… మా పదవీకాలం పూర్తయిపోయింది అన్నట్టుగా కామైపోతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్‌కళ్యాణ్ మీద వైసీపీ తరపున వంగా గీత పోటీ చేశారు. ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానంటూ… ఎన్నికల ప్రచారంలో స్వయంగా చెప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ తర్వాత లోకల్ పార్టీ లీడర్స్…, గీత అనుచరులు ఒక రేంజ్‌లో హైప్ తీసుకువచ్చారు. గీత ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి అయిపోయినట్టు భావిస్తూ…. డిప్యూటీ సీఎం తాలూకూ అంటూ… ఎక్కడలేని బిల్డప్‌లు ఇచ్చారు. కానీ…. ఫేట్ ఎగ్జాక్ట్‌గా తిరగబడింది. పవన్ కళ్యాణ్ గెలవడం, ఆయన డిప్యూటీ సీఎం అవడంతో… ఎవరైతేనేం మొత్తం మీద పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిందన్న మాట అంటూ సెటైర్స్ సైతం పడ్డాయి.
ఇక, ఆ తర్వాత లోకల్ వైసీపీ సౌండ్స్ పూర్తిగా ఆగిపోయాయి. నాడు బిల్డప్‌ల మీద బిల్డప్‌లు ఇచ్చిన వాళ్ళంతా సైలెంట్‌గా సైడైపోతున్నారట. ఫలానా కార్యక్రమాలు చేద్దామని వైసీపీ పెద్దలు చెప్పినా… వీళ్ళు నైస్‌గా అటువైపు వెళ్లడం మానేస్తున్నారని మాట్లాడుకుంటోంది కేడర్. స్వయంగా వంగా గీత నుంచి సమాచారం వెళ్ళినా…. ఇప్పుడు రాలేమని, వేరే కార్యక్రమం ఉందని చెప్పి తప్పించుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు…. ఇక నాలుగేళ్లు మనకు పెద్దగా పని ఉండదు… మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితులు వేరు, ఇక్కడ వేరు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. మిగతా చోట్ల ఉన్నట్టుగా ఇక్కడ మరింత అడ్వాన్స్ అయితే వ్యవహారం తేడా కొడుతుందని వాళ్ళలో వాళ్లే చర్చించుకుంటున్నట్టు సమాచారం. వ్యాపారాలు, ఇతర వ్యాపకాలు అంటూ వాళ్లంతా రాజకీయం గురించి ఆలోచించడం మానేసినట్టు తెలుస్తోంది. పాలిటిక్స్ శాశ్వతం కాదని, పర్సనల్ లైఫ్ ముఖ్యమంటూ కొత్త కలరింగ్ ఇస్తున్నారట కొందరు. 2009లో పిఠాపురం నుంచి పిఆర్పీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు గీత. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్ర విభజన సమయంలో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక 2019లో కాకినాడ ఎంపీగా పనిచేశారామె. 2024లో పిఠాపురం నుంచి పోటీ చేశారు సరే…. వచ్చే ఎన్నికల టైంకి మేడం ఇక్కడే ఉంటారని గ్యారెంటీ ఏంటంటూ కొందరు నాయకులు గడుసుగా ప్రశ్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?
ప్రస్తుతానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమేకదా అని ఎవరన్నా అంటే….., ఆ….. ఇలాంటివి చాలా చూశాం. ఇన్ఛార్జ్‌లుగా ఉన్న వాళ్ళందరికీ టిక్కెట్లు వస్తాయని, పోటీ చేస్తారని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా ఏంటి… అంటూ వెటకారాలాడుతున్నారట. ఆ ప్రశ్న విన్న వాళ్ళు…. అన్నీ రాజ్యాంగంలో ఎందుకు రాస్తారు లేమ్మా… అన్న బ్రహ్మానందం సినిమా డైలాగ్‌ని గుర్తు చేసుకుంటున్నారట. ఎన్నికల టైంకి ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. పెద్ద నాయకులు అవసరాన్ని వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోతారు. బట్ చంటిగాళ్ళు లోకల్. తెల్లారితే మనం ముఖముఖాలు చూసుకోవాలి. ఆ మాత్రం దానికి చించుకోవడం ఎందుకు? మనం మరింత అడ్వాన్స్ అయితే… అధికారంలో ఉన్నవాళ్ళ రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ పిఠాపురం వైసీపీ లీడర్స్ సైలెంట్‌గా సైడైపోతున్నారట. కొందరైతే ఇప్పటికే జనసేన కండువా కప్పేసుకుని యాక్టివ్‌గా యాక్ట్ చేస్తున్నారు. అటు వెళ్లలేక ఇటు ఉండలేక ఉన్న వాళ్ళు మాత్రం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని సైడవుతున్నట్టు సమాచారం. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుందాంలే అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాలను గమనిస్తున్న వంగా గీత సైతం… వీళ్ళని ఎన్ని రోజులని బతిమాలుతాం, లోకల్ సపోర్ట్ లేకుండా మనమేం చేయగలం అంటూ… పార్టీ కార్యక్రమాలను మమ అనిపిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి పిఠాపురంలో ఫ్యాన్ పార్టీ లీడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసలే హై ఫోకస్ సెగ్మెంట్ కావడంతో స్లో అండ్ స్టడీ అంటున్నారట.