ICICI Bank: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేట్లను సవరించినట్లు వివరించింది. 7 రోజుల నుండి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.75 శాతం వడ్డీ రేటును ఇస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. 30 రోజుల నుండి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ రేటు ఇస్తామని పేర్కొంది. అటు 91 రోజుల నుంచి 184 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.75 శాతం వడ్డీని, 185 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై 4.65 శాతం వడ్డీని ఐసీఐసీఐ బ్యాంక్ చెల్లిస్తోంది.
Read Also: lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్
మరోవైపు ఏడాది కాలం నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర 5.35 శాతం నుంచి 5.50 శాతానికి ఐసీఐసీఐ బ్యాంక్ పెంచింది. రెండేళ్ల ఒకరోజు నుండి మూడేళ్ల లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతం నుండి 5.60శాతంగా మార్చింది. మూడేళ్ల ఒక రోజు నుండి ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5.70 శాతం నుండి 6.10 శాతానికి పెంచింది. 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.90 శాతం చొప్పున వడ్డీ అందించనుంది. ఐదేళ్ల టాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే 5.70 శాతం నుంచి 6.10 శాతానికి వడ్డీని పెంచింది. కాగా పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది.