జూన్‌లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం
అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో దూసుకుపోవటం ఇదే తొలిసారి. యూఎస్‌లో గతేడాది జూన్‌లో ద్రవ్యోల్బణం 5.9 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఈ అంచనా 5.7 శాతమే కావటం గమనార్హం.
7.6 శాతానికి ఎకానమీ వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎకానమీ వృద్ధి శాతం 7.1 నుంచి 7.6 మధ్యలో ఉండొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఈ మేరకు జులై 2022 రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మారుపోతున్న నేపథ్యంలోనూ ఇలాంటి అనుకూల అంచనాలు నెలకొనటం విశేషం.
రూ.4,389 కోట్ల పన్ను ఎగవేసిన ఒప్పో
ఒప్పో ఇండియా సంస్థ సుమారు రూ.4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ) నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఒప్పో ఇండియా ఆఫీసుతోపాటు ముఖ్యమైన యజమానుల ఇళ్లల్లో ఈ దాడులు జరిగాయి.
విదేశీ నగదు డిపాజిట్లపై వడ్డీ పెంపు
నివాసేతరులు చేసే విదేశీ నగదు డిపాజిట్ల(ఎఫ్‌సీఎన్‌ఆర్)పై వడ్డీ రేట్లను మూడు బ్యాంకులు పెంచాయి. ఫారెక్స్ నిల్వలను పెంచేందుకు ఆర్బీఐ గత వారం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా డాలర్ డిపాజిట్లపై వార్షిక వడ్డీని ఎస్‌బీఐ 2 పాయింట్ ఎనిమిదీ ఐదు శాతం నుంచి 3 పాయింట్ రెండూ ఐదు శాతం మధ్యకి సవరించింది.
79.66కి పడిపోయిన రూపాయి
రూపాయి విలువ వరుసగా మూడో రోజూ రికార్డు స్థాయిలో పడిపోయింది. తాజాగా బుధవారం 79.66కి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ద్రవ్యోల్బణ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు రిస్క్ అనుకున్న షేర్లను భారీ సంఖ్యలో అమ్మేసుకున్నారు. ఈ ప్రతికూల ప్రభావం రూపాయి మీద భారీగా పడింది.