ప్రస్తుత రోజుల్లో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.పేపర్ ప్లేట్స్ తయారీ, బ్యూటీపార్లర్, టైలరింగ్ ఇంకా ఇతర బిజినెస్ లు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే బిజినెస్ చిన్నదైనా కూడా ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టలేక చాలా మంది మహిళలు వ్యాపారం చేయాలన్న ఆలోచనను విరమించుకుంటున్నారు. ఇలాంటి మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను తీసుకొచ్చింది. మహిళల కోసం ఉద్యోగిని పథకాన్ని అమలు చేస్తోంది.
మహిళా పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ పథకం ఇది. ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 3 లక్షల వడ్డీలేని లోన్ ను అందిస్తోంది. అంతేకాదు వారికి 50 శాతం వరకు సబ్సిడీని కూడా అందిస్తోంది. అంటే సగం రుణం చెల్లించాల్సిన పనిలేదు. మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొంది వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందేందుకు వీలుంటుంది. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగిని స్కీమ్ ద్వారా వంట నూనెల వ్యాపారం చేసేందుకు మహిళలకు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ ఇస్తారు. వెనకబడిన తరగతుల మహిళలకు 50 శాతం సబ్సిడీని అందిస్తారు. అంతేకాదు ప్రత్యేక కేటగిరీ మహిళలకు మొత్తం లోన్ పై రూ. 90 వేల తగ్గింపు ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా మహిళా రైతులకు వడ్డీలేని రుణాన్ని కూడా అందజేస్తారు. ఈ పథకంలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకాన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తాయి.
ఈ పథకం ద్వారా లోన్ పొందాలంటే కుటుంబ వార్షికాదాయం రూ. 1.5 లక్షలు ఉండాలి. మహిళల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. గతంలో తీసుకున్న లోన్స్ సక్రమంగా చెల్లించి ఉండాలి. ఈ పథకం కోసం అప్లై చేసుకోదలిచిన వారు సమీపంలోని బ్యాంకును సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుని లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.