బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు బిగ్ బాస్ హోటల్ టాస్క్ యమ రంజుగా సాగింది. కాజల్, సిరి తమ యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటే, రవి సీక్రెట్ టాస్క్ తోనూ, షణ్ముఖ్, శ్రీరామ్ వెయిటర్స్ గానూ అలరించారు. ఇక రిసెప్షనిస్ట్ కమ్ మేనేజర్ గా యానీ తనదైన నటన ప్రదర్శించింది. సన్నీ కొత్తగా ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చిన కస్టమర్ గా నవ్వులు పూయించాడు. ఓవర్ ఆల్ గా హనీమూన్ కు వచ్చిన కపూల్ గా మానస్, ప్రియాంక మాత్రం ఎందుకో పెద్దంతగా మెప్పించలేకపోయారు. నిజానికి కొద్ది రోజులుగా మానస్ ప్రియాంకకు కాస్తంత దూరంగానే ఉంటున్నాడు. బిగ్ బాస్ షో కారణంగా తన వ్యక్తిత్వంపై మచ్చ పడుతుందేమోననే భయం మానస్ మనసులో ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తోంది. దాంతో అతను పెద్దంతగా ఓపెన్ కావడం లేదు. ఈ సమయంలో బిగ్ బాస్ వీరిద్దరినీ హనీమూన్ కపుల్ గా ఎంపిక చేశాడు. కానీ వారి మధ్య సరైన కెమిస్ట్రీ లేకపోవడంతో అది పండలేదు. అయితే హోటల్ స్టాఫ్ సంపాదించాల్సిన డబుల్ని కస్టమర్స్ నుండి పొందలేకపోవడంతో వారిని లూజర్స్ గా బిగ్ బాస్ ప్రకటించాడు. ఇదే సమయంలో సీక్రెట్ టాస్క్ లో గెలిచినందుకు రవి కెప్టెన్సీ పోటీకి ఎంపికయ్యాడు.
Read Also : 700 ఏళ్ళ నాటి ప్యాలెస్ లో స్టార్ కపుల్ పెళ్లి… జోరుగా ఏర్పాట్లు
టాస్క్ లో ఓడిపోయిన బిబి హోటల్ స్టాఫ్ కు బిగ్ బాస్ ఓ ఛాన్స్ ఇచ్చాడు. గెలిచిన కస్టమర్స్ టీమ్ నుండి ఇద్దర్ని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించవచ్చని చెప్పాడు. దాంతో వారంతా కలిసి హనీమూన్ కపుల్ గా మానస్, పింకీ ఆ క్యారెక్టర్స్ లో సరిగా జీవించలేదనే కారణంగా వారిని కెప్టెన్సీ టాస్క్ కు అనర్హులుగా ప్రకటించారు. వారి నిర్ణయాన్ని మానస్ లైట్ తీసుకున్నా, పింకీ మాత్రం ఆవేశపడిపోయింది. అడ్డమైన రీజన్స్ తో తమను కెప్టెన్సీ టాస్క్ నుండి పక్కకి పంపారంటూ వారిపై నిందలు వేసింది.
ఇక కెప్టెన్సీ టాస్క్ లో ఉన్న రవి, సిరి, సన్నీ, కాజల్ కు బిగ్ బాస్ ‘టవర్ లో ఉంది పవర్’ అనే టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలోని ప్లాస్టిక్ బ్రిక్స్ తో ఎత్తైన టవర్ ను కట్టడంతో పాటు తమ స్నేహితుల సహాయంతో ఆ తర్వాత వాటిని ఇతరులు కూల్చకుండా కాపాడుకోవాలని చెప్పాడు. ఈ టాస్క్ లో మొదట కాజల్ తర్వాత సన్నీ ఓడిపోయారు. చిత్రం ఏమంటే… సన్నీ టవర్ ను కాపాడటానికి ప్రియంక చీర అడ్డంపెట్టింది. కానీ ఆమె చీర తగిలే బ్రిక్స్ పడిపోయాయి. ఆమె కావాలనే అలా చేసిందేమో అనే సందేహాన్ని మానస్, సన్నీ వ్యక్తం చేయడం విశేషం. అలానే ఈ టాస్క్ మధ్యలో ఇంటి సభ్యులు వాదోపవాదాలు మొదలు పెట్టారు. ‘ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని ఆడటం కాదం’టూ సన్నీ చేసిన ఆరోపణలను షణ్ముఖ్, సిరి తీవ్రంగా ఆక్షేపించారు. అలానే కాజల్ తనకు చెక్కిలిగిలి పెట్టడాన్నియానీ ఖండించింది. దాంతో వారిద్దరి మధ్య కూడా మాటా మాటా పెరిగింది. మొత్తం మీద శుక్రవారం జరిగిన ఈ టాస్క్ లో హద్దులు మీరి ఇంటి సభ్యులు అరుచుకోవడంతో శనివారం నాగార్జునతో వీరికి క్లాస్ తప్పదేమో అనిపిస్తోంది. ఇక ఇన్ని వారాల తర్వాత రవి కెప్టెన్ కావడం ఓ రకంగా అందరికీ ఆనందాన్ని కలిగించింది.