2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. 2024 ఆటోమొబైల్ పరిశ్రమకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అయితే.. ఈ సంవత్సరం కొన్ని కంపెనీలు, వాటి మోడళ్లకు చాలా నిరాశపరిచాయి. ఈ12 నెలల వ్యవధిలో 12 మంది కస్టమర్‌లు కూడా కొనని ఓ కారు ఉంది. అవును… మీరు నమ్మకపోయినా ఇది నిజం. దాని పేరు.. సిట్రోయెన్ c5 ఎయిర్‌క్రాస్ (Citroen C5 Aircross). ఈ కారును 2024 జనవరి నుంచి నవంబర్ వరకు 8 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాదు, గత 12 నెలల్లో అంటే డిసెంబర్ 2023 నుండి నవంబర్ 2024 వరకు కేవలం 10 యూనిట్లు మాత్రమే విక్రయించారు. 2024లో దేశంలో అత్యల్పంగా అమ్ముడైన కారుగా ఇది నిలిచింది. అయితే.. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 36.91 లక్షల నుంచి రూ. 39.99 లక్షల వరకు ఉంది.
2024లో సిట్రోయెన్ c5 ఎయిర్‌క్రాస్ అమ్మకాలు
నెల యూనిట్
డిసెంబర్ 2023- 2
జనవరి 2024-1
ఫిబ్రవరి 2024 – 0
మార్చి 2024- 0
ఏప్రిల్ 2024-1
మే 2024- 0
జూన్ 2024- 0
జూలై 2024- 0
ఆగస్టు 2024 -1
సెప్టెంబర్ 2024-1
అక్టోబర్ 2024 – 4
నవంబర్ 2024- 0
మొత్తం- 10
సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఫీచర్లు..
ఈ కారులో 1997cc, DW10FC 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 177 PS శక్తి, 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందించారు. ఈ కారులో 52.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. కంపెనీ ప్రకారం.. ఇది 17.5km/l మైలేజీ ఇస్తుంది. ఈ కారు పొడవు 4500mm, వెడల్పు 1969mm, ఎత్తు 1710mm. దీని వీల్ బేస్ 2730mmగా ఉంది.
ఈ కారులో LED విజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, 3D LED వెనుక ల్యాంప్స్, ORVMలపై LED టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. ఇది 31.24 సెం.మీ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. సెంట్రల్ యూనిట్ 25.4 సెం.మీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ను అమర్చారు. ఇది Apple CarPlay, Android Autoకి మద్దతు ఇస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ తో కూడిన డ్రైవర్ సీటు ఉంది. సీటును ఎలక్ట్రిక్ బటన్ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. కారులో హ్యాండ్స్-ఫ్రీ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అందుబాటులో ఉంది. ఈ కారులో 580 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. వెనుక సీటును మడతపెట్టిన తర్వాత.. దాని బూట్ స్పేస్ 720 లీటర్లు అవుతుంది.