Tata Nexon: కార్ సేఫ్టీ, బిల్ట్ క్వాలిటీకి మారుపేరు ఏంటని ప్రశ్నించే, అందరి నుంచి ముందుగా వచ్చే సమాధానం టాటా. అయితే అలాంటి టాటాపై బెంగళూర్ వాసి ఆరోపణలు చేశారు. ఇటీవల తనకు లోపాలతో ఉన్న టాటా నెక్సాన్ కారు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కారు కొంటున్నాననే ఉత్సాహాన్ని బెంగళూర్ యెలహంకలోని ప్రేరణ మోటార్స్, టాటా చెదిరిపోయేలా చేసిందని సోషల్ మీడియాలో తన ఆవేదన వెల్లగక్కారు.
రూ. 18.2 లక్షల కారు కొన్నప్పటికీ.. తనకు నిరాశే ఎదురైందని అన్నారు. శరద్ కుమార్ అనే కస్టమర్ ఇటీవల నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఆటోమెటిక పెట్రోల్ ఫియర్‌లెస్ ప్లస్ వెర్షన్ కారును తీసుకున్నారు. డెలివరీ తర్వాత హెడ్ లైట్లు, ఫ్రంట్ బంపర్‌పై గీతలు, క్వార్టర్ ప్యానెల్ ఫ్రేమ్, టెయిల్ గేట్ ఫ్రేమ్‌తో పాటు నాసిరకం వెల్డింగ్, సరిగా అమర్చని డోర్ రబ్బర్ బీడింగ్‌లతో సహా పలు లోపాలు ఉన్నట్లు ఆరోపించారు.
Read Also: Rahul Gandhi: “అమిత్ షాకి చరిత్ర తిరగరాసే అలవాటు ఉంది”.. నెహ్రూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ..
యెలహంకలోని ప్రేరణా మోటార్స్ డీలర్‌షిప్ తన కొత్త కారుని తనిఖీ చేయలేదని ఆరోపించారు. టాటా మోటార్స్ చెత్త డీలర్‌గా అభివర్ణించారు. అతని పేరు మీద వాహంన ఇప్పటికే రిజిస్టర్ చేసినప్పటికీ.. డెలివరీ ముందు తనిఖీ (PDI) లేదా నాణ్యత నియంత్రణ (QC) లేకపోవడాన్ని ప్రస్తావించారు. తన ఆందోళనలను చెప్పినప్పటికీ ప్రేరణ మోటార్స్, టాటా మోటార్స్ తగిన చర్యలు తీసుకోలేదని, రీప్లేస్‌మెంట్, రీఫండ్ అందించడంలో వారు ఆసక్తి చూపించలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన బాధను వివరించారు.
ప్రస్తుతం శరత్ కుమార్ వీడియో వైరల్‌గా మారింది. 6.5 మిలియన్ల మంది దీనిని లైక్ చేశారు. దీనిపై టాటా మోటార్స్ స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు, దయచేసి మీ ఈమెయిల్ ఐడీని డీఎం ద్వారా తెలియజేయండి. మా టీం మీ సమస్యలపై సాయం చేస్తారు. ఇప్పటికే ఈ సమస్యపై ప్రేరణా మోటార్స్ సీఈఓ పృథ్వీ, టాటా కర్ణాటక జోనల్ మేనేజర్ మహ్మద్ అహ్మద్‌లు శరద్ కుమార్‌తో చర్చలు జరుపుతున్నారు, నేను వారి పరిష్కారంతో సంతోషంగా లేదని, త్వరలోనే కోర్టులో కలుస్తానని శరద్ కుమార్ చెబుతున్నారు.