ప్రధాని మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు.
ఎయిరిండియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ పైలట్ అర్మాన్ (28) గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో అర్మాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సమస్య కారణంగా సహోద్యోగిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
ఇజ్రాయెల్ రాయబారిగా అర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ నియమితులయ్యారు. మైక్ హకబీ నియామకాన్ని అమెరికా సెనేట్ ధృవీకరించింది. మైక్ హకబీ నియామకంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒబామాతో కలిసి మిచెల్ రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణమైంది.
తమిళనాడుకు చెందిన ఒక జాలరి గొంతులో బతికి ఉన్న చేప అడ్డుపడి ప్రాణాలు కోల్పోయాడు. చెంగల్పట్టులోని మధురాంతకం సమీపంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.
దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం భారీగా వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి గాలులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.