ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 82,398 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్‌ఫ్లో నిల్‌గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో వర్చువల్‌గా మంత్రి సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసెపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు నవీన్(22),వెంకటేష్ (22)లుగా గుర్తించారు. టంగుటూరు మండలం పెళ్లూరు చెరువులో గురువారం ఈత కొట్టేందుకు వెళ్లి ఆ ఇద్దరు యువకులు చెరువు గుంటలో పడ్డారు.