రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అఖిలపక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలి అనే దానిపై సుమాలోచనలు జరిపారు. అదేవిధంగా సభను సజావుగా జరిగేలా సహకరించాలని ప్రభుత్వం సభ్యులను కోరింది. ఈ సమావేశం అనంతరం వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని కోరినట్టు తెలిపారు.
Read: రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, ఉక్కుకు లాభాలు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదే అంశంపై మూడు ప్రతిపాదనలు ఇచ్చినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగినట్టు విజయసాయిరెడ్డి పేర్కార్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, సవతి తల్లి ప్రేమను చూసిస్తోందని అన్నారు. పాండిచ్చేరికీ ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ, ఏపీకి హోదా ఎందుకు ఇవ్వడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాల విషయాన్ని, రావాల్సిన బకాయిల విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని అన్నారు.