టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు.. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ అద్భుతమైన మెజారిటీతో 1995 ఎన్నికల్లో గెలిస్తే… వ్యవస్థలను మేనేజ్ చేసి కుట్ర పూరితంగా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్ చనిపోయారని విమర్శించిన సజ్జల.. వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును చంద్రబాబు వేడుకలా చేసుకోవటం చూస్తే ఈ మనిషికి సిగ్గు ఉందా అనే అనుమానం వస్తుందన్నారు.
Read Also: Twitter: గుడ్‌న్యూస్ చెప్పిన ట్విట్టర్.. ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఆ ఫీచర్ వచ్చేసింది..! కానీ..?
మేము సింగిల్‌గా పోటీ చేస్తామని వినయంగా, ధైర్యంగా చెబుతున్నాం.. చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోతున్నాడు ఒంటరిగా పోటీ చేస్తామని? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి… 30 ఏళ్ళుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఎందుకు పూర్తి చేయలేదు? అని నిలదీసిన ఆయన.. చంద్రబాబు హయాం అనగానే జన్మభూమి కమిటీలు, రెయిన్ గన్స్, బెల్ట్ షాపులు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు.. ఇక, వచ్చే ఎన్నికల నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు.. మేము పారదర్శకతతో ఉన్నాం.. పోలవరం పాపం చంద్రబాబుదే అని అందరికీ తెలిసిన అంశమే అన్నారు.. ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడని మండిపడ్డ ఆయన.. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు.. ఇవాళ.. మళ్లీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెబుతున్నాడని సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.