YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించేందుకు వెళ్తున్నారు. నేటి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10. 15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురం వెళ్లి.. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని.. బెంగళూరుకు వెళ్లనున్నారు.
Read Also: PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకి మోడీ అభినందనలు..
అయితే, వైఎస్ జగన్ ఎందుకు బెంగళూరు వెళ్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు లేదు. అయితే, మూడు నాలుగు రోజుల పాటు అక్కడే బస చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పదే పదే బెంగళూరు వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు బెంగళూరు వెళ్లి వచ్చారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో కొందర్నిని బెంగళూరులో క్యాంపునకు జగన్ తరలించిన విషయం తెలిసిందే.