Blood Donation: రక్తదానం చేయడం గొప్పదానంతో సమానం. మనం చేసే రక్తదానంతో ఒకరి ప్రాణం నిలబెట్టవచ్చు. అందుకే రక్తదాతలను ప్రాణదాతలుగా పరిగణిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎన్నడూ రక్తం కొరతతో ఏ ప్రాణం పోకూడదని.. ఇందుకోసం దేశంలోని ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నానని ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చాక అందరం కలిసికట్టుగా ఉండి పోలియోను ఎలా దీటుగా ఎదుర్కోగలిగామో.. అలానే కలిసికట్టుగా ఆపదలో ఉన్న వారికి సహృదయంతో రక్తదానం చేసేలా అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో రక్తం కొరత వల్ల ఏడాదిలో 12 వేల మంది మృతి చెందుతున్నారని, దేశ జనాభాలోని 0.03 వాటా ప్రజలు స్వచ్ఛంగా రక్తదానం చేస్తే రక్త కొరతతో ఏ ప్రాణం పోదని కిరణ్ వర్మ పేర్కొన్నారు. రక్తం కొరతతో ఏ ప్రాణం పోకూడదని.. స్వచ్ఛంద రక్తదానం కోసం పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read Also: Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్ చోరీ.. స్పందించిన రైల్వేశాఖ
అటు దేశంలో పలు రాజకీయ ప్రముఖులు, సినీ హీరోల పుట్టినరోజు వంటి కార్యక్రమాలకు ఎలా సంఘటితంగా రక్తదానం చేస్తారో.. అలానే నిండు ప్రాణాన్ని కాపాడడానికి అవసరమైన రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు రావాలని కిరణ్ వర్మ పిలుపునిచ్చారు. 2016లో తాను రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని అమ్ముకునే పరిస్థితులు తన కళ్ళముందు కనబడ్డాయన్నారు. కరోనా సమయంలో ఎంతోమంది రక్తం కొరతతో ఘోరంగా ప్రాణాలు విడిచారని, ఇదంతా చూసిన తాను చలించి భారతదేశంలో రాబోవు రోజుల్లో రక్తం కొరతతో మరణాలు జరగకూడదని స్వచ్ఛందంగా డిసెంబర్ 20, 2021 నాడు కేరళలోని త్రివేండ్రం నుంచి 21వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించానని, ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాల్లో పాదయాత్రను పూర్తి చేస్తూ 9,400 కిలోమీటర్లు తిరిగానని తెలిపారు. డిసెంబర్ 31, 2025 నాటికి 21వేల కిలోమీటర్లు పూర్తి చేస్తూ పాదయాత్ర జరిగే ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రదేశంలోని ప్రజలను స్వచ్ఛంద రక్తదాన దాతలుగా మారడానికి అవగాహన కల్పిస్తున్నట్లు కిరణ్ వర్మ పేర్కొన్నారు.