కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోలుపై రూ.9.50, లీటర్ డీజిల్‌పై రూ.7 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49గా ఉండగా.. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.120, లీటర్ డీజిల్ రూ.105.65గా ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.110కి దిగివచ్చే అవకాశముంది. అటు లీటర్ డీజిల్ ధర రూ.100 కంటే తక్కువకే దొరకనుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ట్యాక్సులు తగ్గిస్తే వాహనదారులపై భారం తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. గత ఏడాది నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ఊరట కలిగింది. అప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 సుంకాన్ని కేంద్రం తగ్గించింది. అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాలు వరుసగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. అప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించేందుకు విముఖత వ్యక్తం చేశాయి. మరి ఇప్పుడైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరట కలిగిస్తాయో లేదో వేచి చూడాలి.