కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతాారామన్ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గనున్నాయి. ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై రూ. 200 వరకు సబ్సిడీని ప్రకటించారు. ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్బిడీ వర్తించనుంది. ఈ నిర్ణయం వల్ల 9 కోట్ల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. తగ్గింపు నిర్ణయం ఈ రోజు ( మే 21) అర్థరాత్రి నుంచి అమలులోకి రానుంది. పెట్రోల్, డిజిల్ రేట్లపై కేంద్రం పన్నులు తగ్గించడంతో కేంద్ర ఖజానాకు రూ. లక్ష కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంది.
దిగుమతులపై ఆధారపడిన ప్లాస్టిక్ ఉత్పత్తులకు ముడిపదార్థాలు, మధ్యవర్తులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో పాటు ఉక్కు ముడిపదార్థాలపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అయితే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరచడంతో పాటు సిమెంట్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
గతేడాది 2021 నవంబర్ 3న దీపావళికి ముందు కూడా కేంద్రం ఇలాగే పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించింది. ఆ సమయంలో పెట్రోల్ పై రూ.5, డిజిల్ పై రూ. 10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీని తరువాత పలు బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, కర్ణాటక, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలు వరసగా పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తగ్గించాయి. దీంతో పాటు ఒడిశా, పంజాబ్ వంటి బీజేపేతర రాష్ట్రాలు కూడా పెట్రోల్, డిజిల్ పై పన్నులను తగ్గించాయి. ఇదిలా ఉంటే తెలంగాణ మాత్రం ఎటువంటి రాష్ట్ర పన్నులను తగ్గించలేదు.