Minister Dola Bala Veeranjaneya Swamy: విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు విస్తరించిన తొమ్మిది జిల్లాలను కలుపుకుని “విశాఖ ఎకనామిక్ రీజియన్”ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ ఎకనామిక్ రీజియన్ ద్వారా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించి, అభివృద్ధి అవకాశాలపై సమీక్ష చేశారని మంత్రి పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమైన మంత్రులతో కలిసి ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Read Also: ANCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన Toyota Hilux
అలాగే వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ ఫెస్టివల్ ద్వారా పర్యాటక రంగానికి ఊపునివ్వడంతో పాటు, విశాఖను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, దశలవారీగా అమలు చేయనున్నట్లు మంత్రి డోల బాల వీరంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన పేర్కొన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.