సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు భక్తులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇక సంఘటనాస్థలిని మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 10 రోజుల క్రితమే నిర్మించిన గోడ ఎలా కూలిపోయిందంటూ నిలదీస్తున్నారు.
ఇక ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో కమిటీ దర్యాప్తు చేయనుంది. కమిటీలో రెవెన్యూ, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. బాధ్యులు ఎవరైనా చర్యలు ఉంటాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. గోడలను పరిశీలించి.. నాణ్యతా లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి
గోడ నిర్మాణం చేపట్టినప్పుడే సరైన ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. గోడ కూలిపోయినప్పుడు ఇటుకలు వేర్వేరుగా పడిపోయి ఉన్నాయి. అందులో సిమెంట్ లేనట్టుగా కనిపిస్తోంది. స్ట్రాంగ్‌గా గోడ నిర్మాణం జరగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్షానికి గోడ కూలిపోయిందని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇక కూలిపోయిన గోడకు-క్యూలైన్‌కు దాదాపు మూడు అడుగుల గ్యాప్ ఉంది. వర్షానికి మట్టిపెళ్లలు గోడ మీద పడగానే ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీని బట్టి చూస్తే.. కచ్చితంగా నిర్మాణ లోపమే కారణంగా అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అలాగే ఇద్దరు సాప్ట్‌వేర్ దంపతులు, ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, కేంద్రం రూ.2లక్షలు సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల సాయం ప్రకటించింది. రూ.కోటి సాయం ప్రకటించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.