విశాఖపట్నంలో ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌ను మరింత ఆధునీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ ధరకు మూడు సర్వీసుల్ని అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
Read Also: Etela Rajender: ప్రాణహిత-చేవెళ్లకు అడ్డుపడింది కేసీఆరే..!
ఇదే సమయంలో ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు గుప్పించారు. టెర్రా సాఫ్ట్‌వేర్ అవకతవకల కేసులో ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారని, ఈ కేసులో మొత్తం 18 మంది పాత్ర ఉన్నట్టు తేలిందని, చంద్రబాబు కూడా ఇందులో నిందితుడిగా తేలుతారని ఓ అడ్వకేట్‌గా తాను చెబుతున్నానన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ (APSFL)కి చంద్రబాబు రూ. 650 కోట్ల అప్పు మిగిల్చి వెళ్ళారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు కోసం పని చేస్తే, జగన్ జనం కోసం పని చేస్తున్నారని చెప్పారు.
ఏపీ ఫైబర్ నెట్ వర్క్‌ను ఎనర్జీ విభాగం నుంచి పరిశ్రమల విభాగానికి మార్చడం జరిగిందని చెప్పిన ఆయన.. ఇప్పటివరకు 10 లక్షల కనెక్షన్లు ఏపీలో ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా అందిస్తున్నామన్నారు. మరోవైపు.. రాబోయే ఐదు నెలల్లో లక్ష కిలో మీటర్లు ఫైబర్ వేయబోతున్నామని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు.