Sankranti 2025: సెంటిమెంటుని, పండుగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట! ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నామన్న సంతోషమే ఉంచరు! పైసో, పరకో పట్టుకెళ్దామన్న ఆశను నిలువునా కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండుగ వచ్చేది జనాలకు కాదు.. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌కు! టికెట్ రేటు విషయంలో వాళ్ల నోటికి మొక్కాలి! పెంచే రేట్లకు పద్ధతీ పాడూ లేదు. అడిగేవాడు లేడు! ఒకవేళ అడిగినా ఫాయిదా లేదు. సంక్రాంతి లాంటి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ మొదలుపెడతాయి. టికెట్ రేటు నాలుగింతలు పెంచేస్తాయి. భార్య,భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం.. ఏ కాకినాడో, విశాఖో వెళ్లాలంటే ఆస్తులు సమర్పించుకోవాలి. ఇదేం బాదుడురా భగవంతుడా అనుకుంటూ బీదాబీక్కీ బావురుమంటున్నారు.
Read Also: Off The Record: దానం నాగేందర్ ఆగమాగం అవుతున్నారా..?
రైళ్లన్నీ ఫుల్! లగేజీ, పిల్లలతో కలిసి ట్రైన్‌లో నిలబడి పోవడం అసాధ్యం! ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపినా వాటి పరిమితి వాటికుంది! మిగిలింది ప్రైవేట్ ట్రావెల్స్. ఇదొక్కటే కాస్త బెటర్ ఆప్షన్. ఈ వీక్‌నెస్సే వాళ్లకు కాసులు కురిపించే వనరుగా మారింది. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి రూ.1200 నుంచి రూ.3500 ఉండే చార్జీలు.. ఇప్పుడు రూ.2500 నుంచి రూ.7 వేల వరకు ఉంటున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే ఏపీ స్లీపర్ బసుల్లో ఒక్కో టికెట్ రూ. 4,239 నుంచి రూ. 6239 వరకు ఉంది. వోల్వోలాంటి బస్సుల్లో అయితే 7వేలకు తక్కువ లేదు. విజయవాడకు గరిష్టంగా 3600 వసూలు చేస్తున్నారు.
Read Also: Bangladesh: భారత సరిహద్దుల్లో డ్రోన్లు.. 26 యుద్ధ ట్యాంకుల్ని కొనాలనే ప్లాన్‌లో బంగ్లాదేశ్..
ఆర్టీసీ బస్సులేం తక్కువ తినలేదు. అదనపు చార్జీల పేరుతూ వాళ్లూ బాదుతున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు టీజీ ఆర్టీసీ 6 వేలకు పైగా ప్రత్యేక షటిల్స్ నడుపుతోంది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు మాగ్జిమం 700 రూపాయలు ఉంటే… ప్రస్తుతం 1,050 తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో 2,310 చార్జ్ చేస్తున్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా ప్రతి ఏడాది ఇదే విధంగా చార్జీలు పెంచుతున్నా కూడా కనీస నియంత్రణ చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏకంగా వెబ్సైట్స్ లోనే రేట్లు పెంచి అమ్ముతున్నా కనీస చర్యలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండగల సమయంలోనైనా ట్రావెల్స్ సంస్థలపై అధికారులు దృష్టి సారిస్తే ఎంతోకొంత వారి దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. లేదంటే పండక్కి ఇంటికి వెళ్లిన సంతోషం కూడా ఉండదు.