Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్‌

Baba Ramdev

Baba Ramdev

Baba Ramdev Visits Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాందేవ్ బాబాకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సదర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. జగన్మాత దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం తనకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న రాందేవ్ బాబా.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు స్వయంభువుగా వెలిశారని, అమరావతి సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి మహా శక్తి పీఠం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా రాందేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని.. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతి దేవతల రాజధానిగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.. ఇక, విద్య, వ్యవసాయం సహా పలు రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు రాందేవ్ బాబా.. ఇక, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఉండవల్లి గుహల్లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

×
×
Ad

చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత వినూత్న, సృజనాత్మక, దూరదృష్టి కలిగిన మరియు అమలు సామర్థ్యం ఉన్న నాయకుడని బాబా రాందేవ్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రత్యేక దృష్టి ఆయనకు ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధిని సాధించాలనే ఆలోచనతో పనిచేస్తున్నారని రాందేవ్ తెలిపారు. సంపద సృష్టితో పాటు ఆధ్యాత్మిక విలువలను కూడా సమానంగా ప్రోత్సహించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాన్ని ప్రస్తావించిన బాబా రాందేవ్, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడిలా అంకితభావం, నిజాయితీ, పట్టుదలతో పనిచేస్తే 2047 కంటే ముందే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.