సూపర్ సిక్స్‌లో 90 శాతం అమలు చేసేశామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌కు అనుగుణంగా స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైందని తెలిపారు. స్వచ్ఛమైన తాగు నీరు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇప్పటికే సూపర్ సిక్స్‌లో 90 శాతం అమలు చేశామన్నారు. స్వచ్చంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్‌ను ఏడాదిలోగా తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ఇప్పటివరకూ 81 లక్షల టన్నుల చెత్త తొలగించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ అక్టోబర్ రెండో తేదీకి ముందుగానే 85 లక్షల టన్నుల వేస్ట్‌ను తొలగిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాలతో మున్సిపాలిటీల్లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని.. రాష్ట్రంలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయించినట్లు గుర్తుచేశారు. ఇప్పటికే ఉన్న రెండు ప్లాంట్లకు అదనంగా త్వరలో కొత్తగా ఆరు ప్లాంట్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ప్రతి రోజూ వచ్చే 7000 టన్నుల చెత్తలో 6500 టన్నుల చెత్త విద్యుత్‌గా మారిపోతుందన్నారు. అదే జరిగితే దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: US: డల్లాస్‌లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటి నుంచి వచ్చే నీటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసి బయటకు పంపిస్తామన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ 100 శాతం స్వచ్ఛమైన తాగు నీరు కుళాయిల ద్వారా అందిస్తామని ప్రకటించారు. కార్పోరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పని చేస్తారని కోరుకుంటున్నట్లు నారాయణ చెప్పారు.