విజయవాడ పోలీసులకు కొన్నిరోజులుగా చెడ్డీ గ్యాంగ్ చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ వివరాలను విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్‌గా గుజరాత్‌లోని దాహోద్ పోలీసులను సంప్రదించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ విచారణలో చడ్డీ గ్యాంగ్‌లో కొంతమంది ఏపీకి వచ్చారని గుజరాత్ పోలీసులు ధృవీకరించారు. చెడ్డీ గ్యాంగ్ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య
మరోవైపు విజయవాడ శివారులో చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో నాలుగు చోరీలకు చెడ్డీ గ్యాంగ్ పాల్పడింది. తాజాగా విజయవాడ పోరంకిలోని వసంతనగర్‌లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. ఈ ఘటనలో సుమారు 3 కిలోల వెండి, కొంత బంగారం, నగదు దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా పాల ఫ్యాక్టరీ, గుంటుపల్లి, రైయిన్ బో విల్లాస్ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ అలజడి సృష్టిస్తుండటంతో చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు.
విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ ఆగడాలపై పోలీసులు నిఘా పెంచారు. గుణదల, మధురానగర్, ఉప్పులూరు రైల్వేస్టేషన్‌లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలపై ఆయా రైల్వేస్టేషన్‌లలో సీపీ కాంతిరానా టాటా సీసీ కెమెరాలను పరిశీలించనున్నారు.