కొన్నిరోజులుగా విజయవాడ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. గుజరాత్‌లో నిఘా వేసిన విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువా ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురి కోసం గుజరాత్‌లోనే ఉన్న మరో పోలీసుల బృందం గాలిస్తోంది.
Read Also: సోషల్ మీడియాలో సచిన్ ఆసక్తికర పోస్ట్
కాగా నిందితుల నుంచి రూ. 20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో జరిగిన ఓ పెళ్లి విందులో గతనెల 22న కలుసుకున్న 10 మంది సభ్యుల బృందం దక్షిణాదిలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో గుజరాత్ నుంచి రైలు ద్వారా చెన్నై చేరుకుని… అక్కడి నుంచి గత నెల 28న చెడ్డీ గ్యాంగ్ విజయవాడ చేరుకుంది. 10 మంది సభ్యులు ఐదుగురు చొప్పున రెండు ముఠాలుగా విడిపోయి దొంగతనాలకు పాల్పడి తిరిగి గుజరాత్ వెళ్లిపోయినట్టు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన నిందితులను విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.