విజయవాడ రాజకీయాలు టీడీపీ ఎంపీ కేశినేని నాని చుట్టూ తిరుగుతాయి. ఏపీ రాజకీయాలకు కేంద్రంగా భావించే బెజవాడలో గెలిచి తన సత్తా చాటారు నాని. అయితే కొద్దికాలంగా ఆయన వ్యూహం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాజాగా దూకుడు పెంచిన ఎంపీ కేశినేని నాని,సుమారు నాలుగేళ్ళ తర్వాత నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో అడుగుపెట్టారు. మైలవరం లో బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముందు ఆసక్తికర పరిణామం జరిగింది.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కి,ఎంపీ కేశినేని నానికి పొసగడంలేదనే ఊహాగానాల మద్య తెలుగుదేశం పార్టీలో కాకరేపిన ఎంపీ కదలికలు హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాని సోదరుడు చిన్ని తో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా,మాజీ మంత్రి కి వ్యతిరేక వర్గంగా పేరు బడిన బొమ్మసాని సుబ్బారావు కార్యక్రమాలకు హాజరౌతున్నారు కేశినేని నాని. బొమ్మసానికే తన మద్దతు అని ఇటీవల బహిరంగంగానే ప్రకటించిన నాని.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
Read Also: SRH vs MI: సోసోగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
రంజాన్ తోఫా పంపిణీ వేదికగా గత మూడురోజులుగా నియోజకవర్గంలో బొమ్మసాని ఆధ్వర్యంలో జరుగుతున్న తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరౌతున్నారు ఎంపీ నాని. నాని తో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, క్రియాశీలక నేతలు కార్యక్రమానికి హాజరవుతుండడంతో ఆసక్తిగా మారాయి రాజకీయ పరిణామాలు. ముందుగా ద్వారకాతిరుమల వంశపారంపర్య ధర్మకర్త,పాలకమండలి చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు(ఎస్వీఎస్) దివాణానికి వెళ్ళిన నాని..దివాణానికి వెళ్ళి ఎస్వీఎస్ ఆశీర్వాదం తీసుకున్నారు ఎంపీ కేశినేని నాని. మైలవరంలో గతంలో జమీందార్లు గా వ్యవహరించి, ఇప్పటికీ మైలవరం ప్రజలకు పెద్దదిక్కుగా కొనసాగుతున్న రాజా ఎస్వీఎస్ కుటుంబం దగ్గరకు నాని వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also:Mahamood Ali: ఈద్గాను ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి
మైలవరంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద తలగా వ్యవహరిస్తుంది మైలవరం జమీందార్ కుటుంబం. మైలవరంలో పోటీ చేసే ఆయా పార్టీల నేతలకు రాజకీయంగా చక్రం తిప్పే జమీందార్ కుటుంబ మద్దతు కీలకం అనే చెప్పాలి. కేశినేని నానిని దుశ్శలువాతో సత్కరించారు జమీందార్ ఎస్వీఎస్. జమీందార్ ఎస్వీ ఎస్ తో అంతరంగికంగా సుమారు అరగంట పాటు గడిపిన ఎంపీ కేశినేని నాని ఏం మాట్లాడారోనని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.
అనంతరం మైలవరం హాజీపేటలోని జామియా మసీద్ కి వెళ్ళి నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేశినేని నాని. ప్రార్థనల అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీని కొనసాగించారు ఎంపీ కేశినేని నాని. పేదవారికి సహాయం చేయడమే రంజాన్ ఉపవాస దీక్షల సారాంశమన్నారు ఎంపీ. ఆయనతో పాటు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత ఖాజా రాజ్ కుమార్ మరియు పలువురు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక,ద్వితీయ శ్రేణి నాయకులు పాల్గొన్నారు. జమీందార్ కుటుంబంతో కలయిక నేపథ్యంలో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది నాని వ్యూహం.