ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి… జై భవానీ నామస్మరణతో దుర్గమ్మ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు.. చివరి దశకు చేరినవేళ భక్తుల తాకిడి ఎక్కువైంది. నేడు శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు దుర్గమ్మ… రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది అమ్మారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుంది అనేది భక్తుల నమ్మకం.. సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం… రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతోంది.. మరోవైపు.. భవానీలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో.. ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. మరోవైపు, మూలానక్షత్రం రోజున రెండున్నర లక్షల మంది వరకు భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్ర దర్శనాలు ప్రశాంతంగా సజావుగా పూర్తయ్యేందుకు సహకరించిన అందరికీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల చివరి రోజున కనకదుర్గమ్మ కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనసేవ నిర్వహణపై అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది.