ఏపీలో మండిపోతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు. ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా వాడే ఆయిల్ ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు కిరాణా వ్యాపారులు. తిరుపతిలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. అధిక మొత్త0తో వంటనూనెలు అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు.
బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడుతున్న దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా నూనె ప్యాకెట్ ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. తూనికలు, కొలతలు శాఖ సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీల కోసం ఐదు ప్రత్యేక విజిలెన్స్ బృందాల ఏర్పాటు చేశారు. తిరుపతిలో 9, చిత్తూరులో 4, పీలేరులో 2 దుకాణాల పై కేసులు నమోదు చేశారు.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నూనె ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రచారంతో అక్రమాలకు తెరతీశారు వ్యాపారులు. చిత్తూరు జిల్లాలోని కొన్ని సూపర్ మార్కెట్లో పరిమిత సంఖ్యలోనే సన్ ఫ్లవర్ ఆయిల్ విక్రయాలు జరుగుతున్నాయి.నిన్న మొన్నటి వరకూ 150 రూపాయల లోపే వున్న కిలో సన్ ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో కూడా కేజీ ఆయిల్ 185 తీసుకున్నారని వినియోగదారులు వాపోతున్నారు.