తనను హత్య చేసేందుకు రెక్కీ జరుగుతోందని ఆదివారం నాడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించాయి. దీంతో ఆయన హత్యకు ఎవరు రెక్కీ నిర్వహిస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర స్పందించారు. తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని.. ఎందుకంటే వంగవీటి రంగా హత్యకు కారణం టీడీపీ నేతలే అని తన అభిప్రాయమన్నారు. అయితే తన తమ్ముడితో తనకు ఎన్ని విభేదాలు ఉన్నా.. ఎవరైనా తమ జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.
Read Also: కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగింపు
తన కుటుంబ సభ్యులకు ఏదైనా కష్టం వస్తే ముందుగా నిలబడేది తానేనని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. రాధాకు వ్యతిరేకంగా హత్య కుట్ర జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేనని.. వాళ్ల అంతు చూస్తానని హెచ్చరించారు. తన తమ్ముడిని కాపాడుకునేందుకు అండగా నిలబడతానని.. తన తమ్ముడు రాధాపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని ప్రత్యర్ధులకు వార్నింగ్ ఇచ్చారు. తమ మధ్య విభేదాలు కేవలం రాజకీయాల వరకే పరిమితం అని తెలిపారు.