కరోనా సెకండ్ వేవ్ ఇంకా కలవరపెడుతూనే ఉంది.. కేసులు తగ్గుతున్నా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్.. బయటపడింది.. ఇప్పటికే భారత్‌లో ఆరు, ఏడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తొలి కేసు నమోదైంది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తిరుపతికి చెందిన బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా తేలింది.. పుణెలోని సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. ఇక, డెల్టా ప్లస్ వేరియంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్‌శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది కేంద్రం.. తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్ బయటపడడంతో జాగ్రత్తలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు జాతీయ ఆరోగ్య మిషన్ కార్యదర్శి రాజేష్ భూషణ్… ఏపీ వైద్యారోగ్య శాఖ తీసుకున్న కొన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబటరేటరీస్ కన్సార్షియం- ఇన్సాకాగ్ కు పంపాలని సూచించారు.. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది కేంద్రం..