శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది సర్వదర్శనం. భక్తులు ఎంతోకాలంగా స్వామివారి సర్వదర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే, ఏప్రిల్ 1వ తేది నుంచి ఆర్జిత సేవలకు ,అంగప్రదక్షణంకు భక్తులను అనుమతించనున్న టీటీడీ. తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు రేపటి రోజుకి దర్శన టిక్కేట్లు జారి చేస్తోంది టీటీడీ. కరోనా తర్వాత తిరుమలకు భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. రోజూ సరాసరి 60 వేలమంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల తాకిడి పెరగడంతో హుండీ ఆదాయం పెరుగుతోంది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు 62,956 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 32,837 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.13 కోట్లుగా టీటీడీ ప్రకటించింది.