పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్.. 2 వేల కోట్లతో గడీ మాత్రం కట్టుకున్నాడు..
దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా రూ.2 వేల కోట్లతో గడీ కట్టుకున్నారని కేసీఆర్‌పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
నయా రికార్డ్.. వరుసగా 20 సార్లు టాస్ ఓడి.. 21 సారి గెలిచిన భారత్
భారత్ VS దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నయా రికార్డుకు స్వస్తి పలికింది. అనేక మ్యాచ్‌లో తరువాత భారత్ టాస్ గెలిచింది. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. మ్యాచ్ 1:30కి ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్ ను ఎలాగైన గెలవాలని, ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో టీమిండియా ఉంది. ఇది ఇలా ఉంటే టాస్ విషయంలో భారత్ ఓ రికార్డును బ్రేక్ చేసింది. వరుసగా 20 వన్డే మ్యాచుల్లో టాస్ ఓడిన భారత్.. 21 సారి టాస్ గెలిచింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి మొన్న జరిగిన సెకండ్ ఓడీఐ వరకు వన్డేలో టీమిండియా టాస్ లు ఓడిపోతూ వచ్చింది. 20 సార్లు టాస్ ఓడిన భారత్ తర్వాత రెండో స్థానంలో నెదర్లాండ్ ఉంది. ఈ జట్టు 11 వన్డే మ్యాచుల్లో టాస్ ఓడింది. 2011 మార్చి నుంచి 2013 ఆగష్టు మధ్య కాలంలో నెదర్లాండ్ జట్టు వరుసగా 11 సార్లు టాస్ ఓడింది. భారత్ వరుస టాస్ ఓటములు టీమిండియా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి టాస్ ఓటముల్లో భారత్ టాప్ ప్లేస్ లో ఉంది.
అడవిపై ఆధారపడి బతికే గిరిజనులకు ఆదాయ మార్గాలు పెంచాలి.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
అడవిపై ఆధారపడి బతికే గిరిజనులకు ఆదాయ మార్గాలు పెంచే విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, ఉద్యోగావకాశాల పెంపు వంటి కీలక అంశాలపై డిప్యూటీ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే దిశగా పలు ఆదేశాలు ఇచ్చారు. అడవిపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనులకు సరైన ఆదాయ మార్గాలు సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కల్యాణ్.. అటవీ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. గిరిజనులను ఈ రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఎకో టూరిజం పెంపు ద్వారా గిరిజనులకు ప్రత్యక్షంగా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అద్భుతమైన ప్రకృతి సోయగాలు, జలపాతాలు, అరణ్యాలు, కొండ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని సూచించారు.
విమాన ఛార్జీలపై కేంద్రం కొరడా.. సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటే చర్యల తప్పవని హెచ్చరిక
విమాన ప్రయాణాల్లో 20 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం భారత్ ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. మునుపెన్నడూ లేని కష్టాలు ప్రయాణికులు పడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు నిలిపేసింది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవాళ్లంతా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. లోపలికి వెళ్లి పోయిన బ్యాగ్‌లు వెనక్కి రాక.. ఇటు ఇంటికి తిరిగి వెళ్లలేక ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేం. ఐదు రోజులుగా ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఇంకోవైపు ప్రత్యామ్నాయంగా వేరే ఎయిర్‌లైన్స్‌కు మొగ్గు చూపుతున్న తరుణంలో విమాన ఛార్జీలు చూసి గుండె ఆగినంత పనవుతోంది. ఇండిగోలో తలెత్తిన సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర విమాన సంస్థలన్నీ ఒక్కసారిగా ధరలు పెంచేశాయి. ఆస్తులు అమ్ముకునేలా ధరలు పెంచేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ మాఫియాలోకి రౌడీషీటర్ల ఎంట్రీ.. సంచలన విషయాలు బయటపెట్టిన విజిలెన్స్..
రేషన్ మాఫియా ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది.. గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియా రెచ్చిపోయిందని.. కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియాలో కొత్త ఎత్తుగడలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా పీడీఎస్ (PDS) బియ్యం రవాణా చేసేందుకు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను అండగా తీసుకుంటున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాఫియాపై దాడులు చేయడం, కేసుల నమోదులో వేగం పెంచారు.. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో నరేంద్ర అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని కార్యకలాపాలకు రౌడీ షీటర్లు అండగా ఉన్నట్లు విచారణలో బయటపడింది.
మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిని కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాన చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన NTVతో మాట్లాడుతూ.. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పర్యాటకం పూర్తిగా మారేలా అనేక కీలక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని తెలిపారు. అలాగే, సీప్లేన్ కు వయబిలిటీ సమస్య ఉన్నప్పటికీ, వయబిలిటీని గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే చర్చలు జరిపి, కేంద్ర సహకారంతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
నెహ్రూను కించపరచడమే బీజేపీ లక్ష్యం..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
రేపటిలోపు రీఫండ్‌లను చెల్లించాలి.. ఇండిగోకు కేంద్రం వార్నింగ్
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అనేక ఇబ్బంది పడుతున్నారు. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య సహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరకకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా, ఎక్కువ రేట్లు పెంచడాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు ధరలను పర్యవేక్షిస్తుందన్నారు. కరోనా సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇలా ధరల పరిమితిని విధించిందని గుర్తు చేశారు. అలాగే, ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లను తక్షణమే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. రద్దైన, ఆలస్యం అవుతున్న విమాన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను రేపు (డిసెంబర్ 7) రాత్రి 8 గంటల కల్లా పూర్తి చేయాలని తెలియజేసింది. రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీ షెడ్యూలింగ్ ఛార్జీలు విధించొద్దని కూడా పేర్కొంది.
ఇండిగో సర్వీసుల్లో అంతరాయం.. సీఈవోపై వేటు పడేనా?
ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అయితే, ఈ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పదవి నుంచి తొలగించేలా బోర్డుకు ఆదేశాలు జారీ చేసే ఛాన్స్ ఉందని నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. అలాగే, ఇండిగోపై భారీగా జరిమానా విధించేందుకు రంగం సిద్ధమవుతుందని పౌర విమానయాన శాఖ సీనియర్ అధికారుల కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం కారణంగా విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు, చెన్నైకు నేరుగా స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. వీకెండ్ కావడంతో ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో చెన్నై, బెంగళూరు వంటి నగరాల వైపు ప్రయాణించే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర ప్రయాణికులకు కూడా ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సర్వీసులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు శనివారం సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రస్తుతం రెండు స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని, అవసరమైతే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు కూడా నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.