తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పెను మార్పు.. ఇద్దరు పిల్లల నిబంధనకు చెక్..
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్‌ను సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ శనివారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా, గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న “ఇద్దరు పిల్లల నిబంధన”ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అంటే, ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయడానికి చట్టపరంగా అర్హత సాధించారు.
డ్రగ్స్ తీసుకుంటూ.. పోలీసులకు చిక్కిన ఎమ్మెల్యే కుమారుడు!
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. సుధీర్ రెడ్డి పట్టుబడ్డాడు. నానక్‌రామ్‌గూడలో కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఈగల్ టీమ్, నార్సింగి పోలీసులు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమై సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరికి డ్రగ్స్ పరీక్ష చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సుధీర్ రెడ్డిని అరెస్టు చేసి.. డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పాలమూరుని రాజకీయాల కోసం కేసీఆర్, రేవంత్ వాడుకుంటున్నారు.. నీళ్ల ఇవ్వడం లేదు!
పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించింది. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లతో ఒకరిపై ఒకరు నేపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారేనని మండిపడింది. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ఉన్న మొదటి DPR ప్రకారం తీసుకోవాలని అనేక సార్లు చెప్పడం జరిగింది.. పాలమూరు రైతులతో ఆట ఆడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించింది.
బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. హిందువుల్లో భయాందోళనలు
బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. ఇంకా పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖోకోన్ దాస్ (50) అనే వ్యాపారిని అల్లరిమూకలు కొట్టి నిప్పంటించారు. తప్పించుకునే క్రమంలో చెరువులో దూకాడు. అయినా కూడా ప్రాణం నిలబడలేదు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఖోకన్ దాస్.. ఔషధాలు విక్రయిస్తుంటాడు. షాపు మూసి ఆటో వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు ఆటోను ఆపి దాడి చేశారు. అనంతరం తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే రోడ్డు పక్కన ఉన్న చెరువులో దూకేశాడు. స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే తమకు ఎవరూ శత్రువులు లేరని బాధితుడి భర్య తెలిపింది.
రాజమండ్రి ఆస్పత్రిలో కలకలం.. డెలివరీ వార్డు నుంచి శిశువు మాయం..!
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కలకలం రేపుతోంది.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 14 రోజుల పసి బాలుడు కిడ్నాప్ కు గురైన వ్యవహారం చర్చగా మారింది.. డెలివరీ వార్డులోని బాక్స్ లో పెట్టిన పసి పిల్లాడిని తీసుకుని తల్లి హాస్పిటల్ నుండి మాయమైంది. డిశ్చార్జ్ చేయకుండా.. వైద్య సిబ్బందికి చెప్పకుండా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పిల్లవాడిని తీసుకుని తల్లి పరారైంది. పిల్లవాడిని తల్లి తీసుకుని వెళ్లినట్లుగా వైద్య సిబ్బంది గుర్తించారు.. తల్లి పోలవరం జిల్లా దేవీపట్నం మండలం డీఎన్ పాలెం కు చెందిన కత్తుల బాపనమ్మ గా గుర్తించారు. ఈ మేరకు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. సత్యనారాయణ తెలిపారు.
ఇరాన్‌లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు
ఇరాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రజల తిరుగుబాటుకు అమెరికా, ఇజ్రాయిల్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం 3,000 మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో వారి భద్రతపై వైద్య విద్యార్థుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
వెనిజులాపై బాంబులతో విరుచుకుపడిన అమెరికా..
వెనిజులాపై అగ్రరాజ్యం అమెరికా బాంబులతో విరుచుకుపడింది. వెనిజులా రాజధాని కారకాస్‌లో శనివారం తెల్లవారుజామున అగ్రరాజ్యం దాడి కారణంగా అనేక శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సంభవించిన పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురై, వీధుల్లోకి పరుగులు తీశారు. అమెరికా దాడి కారణంగా వెనిజులా అధ్యక్ష భవనం చుట్టూ సైరన్లు మోగాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:50 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో రాత్రి చీకటిలో పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపించాయి. పలు నివేదికల ప్రకారం.. కారకాస్, తీరప్రాంతాలు, హిగ్యురోట్ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే పేలుళ్లపై వెనిజులా ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ సంఘటనల మధ్య అమెరికా.. వెనిజులా అన్ని విమానాలకు గగనతలాలను మూసివేసినట్లు ప్రకటించింది. వెనిజులాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా హెచ్చరించిన సమయంలో ఈ నిర్ణయం రావడం విశేషం. గురువారం ప్రసారం చేసిన ముందస్తు రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడుతూ.. వెనిజులాలో ప్రభుత్వ మార్పుపై ఒత్తిడి తీసుకురావాలని, దేశంలోని విస్తారమైన చమురు నిల్వలను పొందాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన యూఎస్..
అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులతో విరుచుపడుతోంది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా దాడులు చేసింది. ఈ ఘర్షణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను పట్టుకున్నట్లు ప్రకటించాడు. వెనిజులా నుంచి అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది. వెనిజులా రాజధాని కారాకస్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అమెరికా దాడులు నిర్వహించింది. పేలుళ్ల తర్వాత భవనాలు మంటల్లో చిక్కుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ దాడులు నిర్వహించిట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా మాట్లాడుతూ.. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురో మరియు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం బయటకు తరలించినట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. పతన దిశగా అగ్రనాయకత్వం.?
తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా భావించదగ్గ పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాటమే మార్గంగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సైనిక విభాగం అయిన పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PGLA) చీఫ్ బర్సె దేవా, మరో 48 మంది అనుచరులతో కలిసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ భారీ లొంగుబాటు మావోయిస్టు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంలో పడేసింది. ఒకప్పుడు 41 మంది సభ్యులతో అత్యంత బలంగా ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ, వరుస ఎన్‌కౌంటర్లు , లొంగుబాట్ల కారణంగా ప్రస్తుతం కేవలం నలుగురు సభ్యులకు మాత్రమే పరిమితం కావడం ఆ పార్టీ పతన దిశకు సంకేతంగా కనిపిస్తోంది.
“హిందూ ఎస్ఐ సంతోష్‌ను చంపింది నేనే”.. యూనస్ పాలనలో అరాచకం..
బంగ్లాదేశ్‌లో అరాచకం ఏ విధంగా రాజ్యమేలుతుందనే దానికి ఈ సంఘటన ఉదాహరణ. విద్యార్థి ఉద్యమం ముసుగులో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కొనసాగిన ఈ హింసాత్మక సంఘటనల్లో అనేక మంది హిందువుల్ని హత్య చేయడంతో పాటు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. తాజాగా, ఆనాటి అరాచకాలకు మతోన్మాద విద్యార్థి నేత హిందూ ఎస్‌ఐని చంపినట్లు నిర్భయంగా ప్రకటించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. 2024లో పాలన మార్పు ఆపరేషన్ సమయంలో సంతోష్ చౌదరి అనే హిందూ ఎస్ఐని హత్య చేశారు. ఈ హత్య గురించి బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తి గొప్పుగా చెప్పుకుంటున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోను జర్నలిస్ట్ సాహిదుల్ హసన్ ఖోకోన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ముస్లిం వ్యక్తి మేము బినాయాచాంగ్ పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టాము, మేము ఎస్ఐ సంతోష్‌ను చంపాము అని గొప్పగా చెప్పడం వినిపిస్తుంది. “నన్ను గుర్తుపట్టలేదా? హిందూ సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్‌ను సజీవంగా కాల్చి చంపింది నేనే. 2024 ఆగస్టులో జరిగిన అల్లర్ల సమయంలో బనియాచోంగ్ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టింది కూడా నేనే!” అని ధైర్యంగా పోలీస్ స్టేషన్‌లో చెప్పుకోవడం వీడియోలో చూడవచ్చు.